గణపతి బప్పా... జల్దీ ఆజా!
గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా... అంటూ ఆ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు బాలీవుడ్ తారలు. వినాయక నిమజ్జనం దక్షిణాదిన కూడా ఉన్నప్పటికీ ఇక్కడి తారలెవ్వరూ పెద్దగా నిమజ్జనోత్సవాల్లో పాల్గొనరు. కానీ, హిందీ తారలు అలా కాదు. స్వయంగా మంటపాలకు వెళ్లి, వినాయకుణ్ణి సందర్శిస్తారు. వీలు చేసుకుని నిమజ్జనం కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సమయంలో జనాలు గుమిగూడినా, చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఈ ఏడాది అలా సందడి చేసినవాళ్లల్లో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
తన భర్త, చెల్లెలు షమితా శెట్టితో కలిసి తమ వినాయకుడి నిమజ్జనోత్సవంలో శిల్పా తీన్ మార్ డాన్స్ చేశారు. బచ్చన్ కుటుంబం నుంచి అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్ ఓ మంటపంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి దర్శించుకున్నారు. చుట్టూ మూగిన అభిమానులకు వీరు అభివాదం కూడా చేశారు. అమీషా పటేల్ స్టెప్పులేయలేదు కానీ.. తన గణేశ్‌ని ఘనంగానే సాగనంపారు. ఇక, సోనాలీ బెంద్రే అయితే పట్టుచీరలో తళుకులీనారు.
ముంబయ్‌లో ఓ ఏరియాలో ఏర్పాటు చేసిన గణపతిని తన భర్త గోల్డీ బెహల్‌తో కలిసి సందర్శించారామె. హృతిక్ రోషన్ అయితే ఎప్పటిలానే తన తల్లిదండ్రులు రాకేష్, పింకీ రోషన్, ముద్దుల కుమారులు రెహాన్, రిధాన్లతో కలిసి గణపతి బప్పాకి వీడ్కోలు పలికారు. గత ఏడాది వరకు ఆయన భార్య సుజానే ఖాన్ కూడా సందడి చేసేవారు.
ఇటీవలే విడిపోయిన నేపథ్యంలో హృతిక్ సరసన ఆమె మిస్సింగ్. సోనాక్షీ సిన్హా అయితే ఫుల్ మాస్. నిమజ్జనం ఉత్సవాల్లో ఓ రేంజ్లో చిందులేశారామె. ఇంకా పలువురు బాలీవుడ్ తారలు.. తమదైన శైలిలో వినాయకుడికి వీడ్కోలు పలికి, వచ్చే ఏడాది ‘జల్దీ ఆజా’ అని కోరుకున్నారు.