దీక్షా తోరణం... నియమాల ధారణం
తల్లితండ్రులు తమ బిడ్డలు క్రమశిక్షణతో పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మార్గంలో నడచుకోవాలని కోరుకోవడం సహజం. అదేవిధంగా దేవతలందరూ కూడా తమ బిడ్డలైన మనందరంక్రమశిక్షణ, భక్తి విశ్వాసాలతో మెలగాలనే ఉద్దేశంతో కొన్ని దీక్షాపద్ధతులను అనుగ్రహించారు. వాటిని సక్రమంగా పాటించి, తమను దర్శించుకున్న వారికి కోరిన వరాలను అనుగ్రహిస్తామన్నారు. అందుకే అనేకమంది భక్తులు తమ శక్తి మేరకు దీక్ష తీసుకుని, తమ ఇష్టదైవం కొలువై ఉన్న కొండలనో, గుట్టలనో చేరి, వారికి ఇరుముడి సమర్పించడం సంప్రదాయంగా మారింది.
గతంలో ఈ దీక్షలు, నియమ నిష్ఠలను సమాజంలో కొన్ని వర్గాల వారు మాత్రమే పాటించేవారు. అయితే కాలానుగతంగా వస్తున్న మార్పులలో భాగంగా ఇప్పుడు కుల, లింగ, వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయా దీక్షలను నిస్సంకోచంగా స్వీకరిస్తున్నారు. నియమబద్ధంగా పాటిస్తున్నారు. అయితే స్త్రీల విషయంలో మాత్రం కొన్ని నియమాలు తప్పవు. రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం మాల ధరించడానికి వీలు లేదు. రుతుక్రమం ఇంకా మొదలు కాని బాలికలు, శారీరకంగా ఆ ధర్మాన్ని అధిగమించిన వారు మాలధారణ చేయవచ్చు.
ఉదయాన్నే లేవటం, చన్నీటి స్నానం చేయటం, రెండోపూట భోజనం, ఉల్లి, వెల్లుల్లి వంటి మసాలా దినుసులతో సహా మద్యమాంసాదులకు దూరంగా ఉండటం, పాదరక్షలు లేకుండా నడవడం, అశ్లీలానికి, పరనిందకు తావివ్వకపోవడం, బ్రహ్మచర్యం, భూశయనం, విభూతి, చందన ధారణం, ఆలయ సందర్శనం, సత్సంగం, భజనలు, పురాణ పఠనం, శరణుఘోష చెప్పుకోవడం, భగవద్ధ్యానంలో కాలం గడపడం ... ఇవీ దీక్ష తీసుకున్న వారు పాటించవలసిన నియమాలు. అయ్యప్పదీక్షతో సహా, అనేక దీక్షలలో బాహ్యంగా కనిపించే నియమాల కన్నా, అందులోని ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను తెలుసుకుంటే మాలధారణ చెయ్యాలనిపించకమానదు.
నియమాలు పాటించని దీక్ష నిష్ఫలం: కపట భక్తి, పటాటోపం, ప్రచారాడంబరం, సంపద, బల ప్రదర్శన, అహంకారం, అతిశయంతోనూ, మాలను అడ్డుపెట్టుకుని చేసే వంచనలు, కేవలం పదిమంది దృష్టిలోనూ ‘మంచివారనిపించుకోవడం కోసం’ చేసే అన్ని రకాల ఆరాధనలు, పూజలూ నిష్ఫలం, నిష్ర్పయోజనం. అటువంటి వాటిని భగవంతుడు అంగీకరించడు. అటువంటివాటిని కనిపెట్టే వాడొకడున్నాడన్న వివేకం, చైతన్యం లేనివారు మాల ధారణకు అర్హులు కారు. మాల ధరించేటప్పుడే నియమనిష్ఠలను పాటించగల ఓర్పు, ఇంద్రియనిగ్రహం ఉండేలా చూసుకోవడం అవసరం.
ఆధ్యాత్మికంగా... ఆరోగ్యంగా... ఈ దీక్షలలోని ప్రతి ఒక్క నియమమూ ఆరోగ్యాన్ని కాపాడే అమృతోపకరణమే. చన్నీటి స్నానం ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మెడలో ధరించే తులసి లేదా రుద్రాక్ష మాల రక్తపోటు, మధుమేహం, చిన్న చిన్న మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేయడానికి ఉపకరిస్తుంది. ఆహార నియమం కోరికలను దూరం చేసి, మనోనిశ్చలతనిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది. పాదరక్షలను ధరించకుండా తిరగడం వల్ల భక్తులకు కష్టాలను ఓర్చుకునే శక్తి కలుగుతుంది. పాదాల కింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలుంటుంది. నరదృష్టి దోషాన్ని హరించే శక్తినివ్వడంతోబాటు రంగురంగుల దుస్తులపై మమకారం ఉండకుండా చేసేందుకే దుస్తుల నియమం. విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, ధైర్యం, బలం కలగడంతోబాటు వాత, పిత్త, కఫరోగాలు దరి చేరకుండా ఉంటాయి. వెన్నెముక గట్టిపడి, వీపు నొప్పి వంటి రుగ్మతలు లేకుండా చేసేందుకే భూశయనం. బ్రహ్మచర్య దీక్ష దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుతుంది.
దీక్షాకాలంలో భగవంతుని మీద భక్తి విశ్వాసాలు, నిరాడంబరత, మృదుభాషణ వంటి మంచి లక్షణాలను అవలంబిస్త్తూ, ఆత్మప్రక్షాళన చేసుకుంటారు భక్తులు. అయితే కేవలం దీక్షాకాలంలోనే కాదు, ఆ తర్వాత కూడా అదే మార్గాన్ని అవలంబించిన వారికి జీవితమంతా సన్మార్గ సౌరభాలు వెదజల్లుతుందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.
గణపతి దీక్ష, అయ్యప్పమాల, భవానీ దీక్ష, గోవిందమాల, శనైశ్చర దీక్ష, దత్తమాల, సత్యవ్రతదీక్ష, శివదీక్ష, సాయిమాల, కనకమహాలక్ష్మి దీక్ష, హనుమద్దీక్ష... ఇలా ఎన్నో మాలలు... దీక్షలు ఉన్నాయి. భక్తులు తమ విశ్వాసానికి అనుగుణంగా ఆయా దీక్షలు తీసుకుని, అందులోని నియమాలను పాటిస్తుంటారు. నియమిత కాలం పాటు క్రమం తప్పకుండా పాటించే ఈ దీక్షల మూలంగా అటు మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక దృఢత్వమూ కలుగుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది. అంతరంగం శుభ్రపడుతుంది.