టపాకాయల తయారీ కేంద్రంలో పేలుడు
ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
భయంతో పరుగులు తీసిన ప్రజలు
అగ్నిమాపక అధికారుల సాహసంతో అదుపులోకి వచ్చిన మంటలు
చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: చిత్తూరు నడిబొడ్డున ఉన్న ఒక టపాకాయల తయారీ కేంద్రంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో కాపురముంటున్న కిశోర్ గాంధీరోడ్డులో లెసైన్సు కలిగిన టపాకాయల కేంద్రం నడుపుతున్నాడు.
ఏడాదిగా అనధికారికంగా పలమనేరు రోడ్డులోని సొంత భవనంలో ఐదుగురు కూలీలను పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా టపాకాయలు తయారు చేసి, అమ్ముతున్నాడు. గురువారం ఖాజా(36), షబానా(28), సైదాని(40)తో నలుగురు కూలీలు టపాకాయల తయారీలో నిమగ్నమయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంట్లో నిల్వ ఉంచిన నల్లమందు వేడెక్కింది. కార్మికుని చేయి తగిలి చిన్నపాటి వస్తువు నల్లమందుపై పడడంతో పేలుడు సంభవించింది.
భారీ శబ్దంతోపాటు భవనం నుంచి పొగలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనంలో నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో అక్కడికి చేరుకుని గాయాలపాలైన ఖాజా, షబా నా, సైదానిని బయటకు తీసి అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు అగ్నిమాపక అధికారి ప్రవీణ్‌కుమార్, జిల్లా అగ్నిమాపక ఉప అధికారి శ్రీనివాసరావు సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని నీటిని స్ప్రే చేశారు. కొంతవరకు మంటలు అదుపులోకి రావడంతో లోనికెళ్లే ప్రయత్నం చేశారు. అయితే డ్రమ్ముల్లో నుంచి పేలుళ్లు ఆగకపోవడంతో గంటకు పైగా శ్రమించి కెమికల్ పౌడర్ స్ప్రే చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ
పేలుడు సంభవించిన విషయం తెలియగానే చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, ఎప్పటి నుంచి ఇక్కడ టపాకాయలు త యారు చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భవనంలోని డ్రమ్ములు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో నల్లమందు నిల్వ ఉంచి టపాకాయలు, బాణసంచా తయారు చేస్తున్న కిశోర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లెసైన్సు లేకుండా తయారు చేస్తున్నా పోలీసులు ఇంతకాలం గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.