ఫామ్‌హౌస్‌లో దొంగల బీభత్సం..
రాజేంద్రనగర్: ఫామ్‌హౌస్‌లో చొరబడ్డ దొంగలు మూడు గంటలపాటు స్వైరవిహారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గండిపేట్ శ్రీనగర్‌లో అనంతసేనారెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు(60) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య ధనలక్ష్మి(55)తోపాటు మనువరాలు దీప(7) ఇతనితోపాటు ఉంటున్నారు. గురువారం రాత్రి 10.30కి ఆరుగురు దుండగులు ప్రధాన గేటు దూకి ఫామ్‌హౌస్ లోనికి ప్రవేశించారు. వాచ్‌మన్ గది వద్దకు వచ్చిన వారు హిందీలో వెంకటేశ్వరరావును పిలిచి తలుపు తెరిపించారు. బయటకు రాగానే చితకబాదారు. అలికిడికి మేల్కొన్న ధనలక్ష్మిపైనా దాడిచేశారు. వెంకటేశ్వరరావు తల పగలగా, ధనలక్ష్మి చేతికి గాయమైంది.
తర్వాత ఇద్దరినీ చెట్టుకు కట్టేసి డబ్బు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయని హిందీలో బెదిరించారు. తమకు హిందీ రాదని చెప్పగా తెలుగులో మాట్లాడి ఇద్దరినీ చితకబాదసాగారు. దీంతో చిన్నారి దీప తన తాత,నానమ్మలను కొట్టవద్దని డబ్బులున్న బీరువాను చూపించింది. అందులో ఉన్న రూ.40 వేల నగదు తీసుకున్న దొంగల చిన్నారి చెవికమ్మలనూ లాక్కున్నారు. ధనలక్ష్మి మెడలో ఉన్న రోల్డ్‌గోల్డ్ మంగళసూత్రాన్ని తెంచుకున్నా రు. రాత్రి ఒంటి గంట తర్వాత దొంగలు గేట్దూకి పారిపోయారు. వీరు వెళ్లిన వెంటనే దీప ఇరువురి కట్లను విప్పింది. ఇద్దరూ పక్కనే ఉన్న ఫామ్‌హౌస్ వాచ్‌మన్ ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటనా స్థలాన్ని క్రైం డీసీపీ జానకీ షర్మిళ, శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి పరిశీలించారు.
బీరువాను తెరిచేందుకు...
ఫామ్‌హౌస్‌లోని ఓ గదిలో సేఫ్‌లాకర్ ఉంది. దాన్ని తెరిచేందుకు దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో విఫలయత్నం చేశారు. ఇందులో భారీ మొత్తంలో నగదు ఉంటుందన్న ఆశతో వారు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఇది తెలిసిన వారి పనే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. బాధితులు దొంగల్లో ఒక్కరిని కూడా గుర్తు పట్టకపోవడంతో బట్టి ఫామ్‌హౌస్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరో వీరిని పంపి ఉంటారని భావిస్తున్నారు.