నీవు తాగుబోతువి.. నోరు మూసుకో
► మున్సిపల్ ఎంఈని దుర్భాషలాడిన టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త
► గది నుంచి బయటకు రాకుండా నిర్బంధం
► చైర్మన్ ముందే అధికారులపై వీరంగం
► కౌన్సిల్ సమావేశంలోకి వచ్చి బైఠాయింపు
► మేము పని చేయలేమంటూ సెలవులపై వెళ్లిన డీఈలు,ఏఈలు
ప్రొద్దుటూరు టౌన్: అధికార పార్టీ కండువా కప్పుకొని మున్సిపల్ ఇంజినీర్(ఎంఈ) సురేంద్రబాబుపై 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ గాండ్ల శకుంతల, ఆమె భర్త గాండ్ల నారాయణ స్వామి గురువారం పరుష పదజాలంతో దుర్భాషలాడారు. మర్యాద పూర్వకంగా మాట్లాడాలని ఎంఈ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరింత రెచ్చిపోయారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని ఎంఈ చాంబర్ ప్రధాన ద్వారానికి కుర్చీలు వేసుకొని అడ్డుగా కూర్చున్నారు. తన వార్డులో పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ఎంఈని ప్రశ్నించారు. పనులు చేస్తున్నారని చెప్పినా వినలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కౌన్సిలర్, ఆమె భర్తతో మాట్లాడుతుండగానే కౌన్సిలర్ భర్త ఆవేశంతో ఊగిపోయారు.
నీవు తాగుబోతువి, నోరు మూసుకొని కూర్చో అని పరుష పదజాలంతో ఎంఈని మాట్లాడారు. ఎంఈ గౌరవంగా మాట్లాడాలని చెప్పడంతో మరింత రెచ్చిపోయారు. అక్కడికి వచ్చిన డీఈ ఆర్కే శ్రీనివాసులు, ఈఏ అబీద్హుసేన్ శ్రీరాములపేట వీధిలో 16 మంది కూలీలు పనులు చేస్తున్నారని, మేము ఎంత చెప్పినా మీరు వినిపించుకోకుండా ఇక్కడకి వచ్చి ఎంఈని అలా మట్లాడటం సబబు కాదని అన్నారు. దీంతో వారినీ దూషించాడు. చైర్మన్ సాక్షిగా అధికారులను దూషణల పర్వ కొనసాగింది. లక్షలు లంచాలు తీసుకుంటున్నారు, సెలవుపెట్టి వెళ్లిపోండని హుకుం జారీ చేశారు.
సామూహిక సెలవులు
డీఈలు ఆర్కే శ్రీనివాసులు, రాజేష్, షాకీర్, ఏఈలు అబీద్హుసేన్, ఈశ్వరరెడ్డి, జీఏఈలు పనులు చేస్తున్న మమ్ములను, ఎంఈని దూషించడాన్ని నిరసిస్తూ సామూహిక సెలవుల్లో వెళుతున్నట్లు చైర్మన్‌కు చెప్పారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్నకు ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా జరిగిన విషయాన్ని రాసి ఇవ్వాలని కమిషనర్ చెప్పడంతో అధికారులు కమిషనర్‌కు ఫిర్యాదు పత్రాన్ని పంపి కార్యాలయం నుంచి వెళ్లి పోయారు.
12.30 గంటల వరకు ఎంఈ నిర్బంధం
టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త ఎంఈ చాంబర్‌కు అడ్డుగా కూర్చున్నారు. కౌన్సిల్ సమావేశంలోకి రావాలంటూ కొందరు టీడీపీ కౌన్సిలర్లు ఎంఈని ఆయన చాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎలా బయటకు తీసుకెళతారని టీడీపీ కౌన్సిలర్లతో కూడా కౌన్సిలర్ భర్త వాగ్వాదానికి దిగారు.
కౌన్సిల్ సమావేశంలో పార్టీ కండువా కప్పుకొని బైఠాయింపు...
కౌన్సిలర్, ఆమె భర్త కౌన్సిల్ సమావేశంలోకి వచ్చారు. సభ్యుని సీటులో కొంత సేపు కూర్చుని, మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా చైర్మన్ సీటు ముందు కూర్చున్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరిదేవి మాట్లాడుతుండగా ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడేందుకు వచ్చినా వినిపించుకోలేదు. దీంతో కమిషనర్, సిబ్బంది, చైర్మన్ బయటకు వెళుతుంటే వారిని కౌన్సిల్ సమావేశ మందిరంలో నేలపై పడుకొని అడ్డుకున్నారు. కమిషనర్ అధికారులందరినీ బయటకు రావాలంటూ పిలుచుకెళ్లారు.
మరో టీడీపీ కౌన్సిలర్ రామమునిరెడ్డి, చైర్మన్లపై ఆవేశంతో కౌన్సిలర్ భర్త ఊగి పోయారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని చెబుతున్నా వినిపించుకోలేదు. మరి కొందరు కౌన్సిలర్ల ఆతన్ని చైర్మన్ చాంబర్లోకి తీసుకెళ్లారు.
బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు అధికార పార్టీ టీడీపీ కౌన్సిలర్ భర్త కౌన్సిల్ సమావేశ మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సింది పోయి ముందుగానే మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.