ఇదిగో.. వచ్చేస్తున్నా..!
శరవేగంగా గణపయ్యల తయారీ
వివిధ రూపాల్లో విగ్రహాలు అందుబాటులో
ఉపాధి పొందుతున్న రాజస్థానీ కార్మికులు
గద్వాల న్యూటౌన్ : భక్తులను దీవించడానికి మన బొజ్జ గణపయ్య వచ్చేస్తున్నాడు. మరో వారం రోజులు ఆగితే ప్రతి వీధిలో ఆది దేవుని దర్శన భాగ్యం ఉంటుంది. చిన్నాపెద్ద ఏకమై విఘ్నేశ్వరుని సేవలో మునిగి తేలుతారు. వారం రోజులు గ్రామాలు, పట్టణాలు, అన్ని వీధుల్లో సందడేసందడి నెలకొంటుంది. ఇప్పటికే మంటప నిర్వాహకులు విరాళాల సేకరణలో ఉండగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కార్మికులు గణపయ్యల తయారీలో నిమగ్నమై ఉన్నారు.
వివిధ రూపాల్లో..
సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితిని దష్టిలో ఉంచుకొని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కార్మికులు పట్టణంలో మకాం వేశారు. తమ కళా నైపుణ్యంతో వివిధ రూపాల్లో గణపయ్యలను తయారు చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. 15ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు స్థానికంగానే విగ్రహాలను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ నుంచి విగ్రహాలకు కావాల్సిన ముడిసరుకులు తెచ్చుకుని రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మయూరం, గరుడవాహనం, మొసలిపై, గజవాహనం, నేటి లేటెస్ట్ వాహనాలతోపాటు పార్వతీపరమేశ్వరుల ఒడిలో కూర్చున్నట్టు, బాహుబలిలా కనువిందు చేసే ఎన్నో రకాల విగ్రహాలను పండగ వరకు వేలల్లో తయారుచేసి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు.
ఏర్పాట్లలో మంటప నిర్వాహకులు
గణేష్ ఉత్సవ కమిటీలు తమదైన శైలిలో విగ్రహాలను ప్రతిష్ఠించడానికి సన్నద్ధమవుతున్నారు. దేవతామూర్తిని ఎంత ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతే అంత పేరు వస్తుండటంతో ఈ సారి పోటీతత్వం మరీ పెరిగేలా ఉంది. ఇప్పటికే నిర్వాహకులు విరాళాల సేకరణ పూర్తిచేసుకొని మంటపాలను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
పనులు పూర్తికావచ్చాయి
పండగకు ఇంకా వారం రోజులే ఉండటంతో విగ్రహాల పనులు పూర్తి కావచ్చాయి. ప్రతి ఏడాది పండుగకు నాలుగు నెలలముందునుంచే తయారీ మొదలు పెడతాం. అందరికి నచ్చేలా ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేశాం. ప్రతి ఏటా విగ్రహాలు అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.
– మోతీలాల్, తయారీదారుడు (రాజస్థాన్)