టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు
సాక్షి, ముంబై: జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణపై శివసేన మాజీ తాలూకా అధ్యక్షుడు గణేష్ అధానేపై ఔరంగాబాద్ జిల్లా కుల్‌తాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో గణేష్ అదానేను పార్టీ నుంచి బహిష్కరించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, తిరిగి ఈ నెల 6వ తేదీన గణేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. తనను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని చెప్పారు.
గణేష్ అదానే కుటుంబసభ్యుల సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రాయడంతో ఆయన 18న ముంబైలోని శివసేన కార్యాలయానికి పిలిపించుకుని అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని సీరీయస్‌గా తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే వెంటనే గణేష్‌ను శుక్రవారం పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది జరిగిన వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.