ఖైరతాబాద్ మహాగణపతికి వీడ్కోలు
హైదరాబాద్: పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం నుంచి సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌తో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అరవై వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా 59 అడుగుల భారీ విగ్రహంతో పదకొండు రోజుల పాటు భక్తులను అలరించిన గణనాథుడు భక్తుల జయజయ ధ్వానాల మధ్య సాగరుడి ఒడికి చేరాడు. ప్రత్యేక క్రేన్ ద్వారా గణనాధుడిని హుస్సేన సాగర లో నిమజ్జనం చేశారు. మరోవైపు పదకొండు రోజులు పాటు జరిగిన గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా చూడటంతో పాటు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నగరవాసులకు మరింత దగ్గరయ్యారు. వినాయక చవితి, బక్రీద్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ ఒక్క నెలలోనే రావడంతో... ఎక్కడేం జరుగుతుందోనని తొలుత ఆందోళన చెందిన పోలీసులు పక్కా ప్రణాళికతో బయటి రాష్ట్రాలు, కేంద్రాల నుంచి బలగాలు తెప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బక్రీద్, వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు.