1/6
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17 జరిగే వినాయక నిమజ్జనాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషర్ ఆమ్రపాలి తెలిపారు.
2/6
హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్‌ను సిద్ధం చేశారు. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ.. విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు.
3/6
హైదరాబాద్ మహానగరంలో సుమారు లక్ష విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో.. హుస్సేన్ సాగర్‌తోపాటు జంటనగరాల పరిధిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వివరించారామె. ట్యాంక్‌బండ్‌వైపు మినహా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో ఇప్పటికే భారీ క్రేన్లను సిద్ధం చేశారు. పీవీ మార్గ్‌లో నిమజ్జనాల సందడి గత మూడు రోజుల నుంచే కొనసాగుతుండగా చివరి రోజున భారీగా గణనాథులు సాగరం వైపు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు.
4/6
శోభయాత్ర నుంచి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. చెట్ల కొమ్మల తొలగింపు ఇప్పటికే పూర్తయిందని, రహదారి మరమ్మతులు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు అమర్చే ప్రక్రియ కొనసాగుతుందని ఆమ్రపాలి తెలిపారు. పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, నిమజ్జన ప్రక్రియను సాఫీగా జరిగేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
5/6
హుస్సేన్ సాగర్ కాకుండా.. మొత్తం ఆరు జోన్లలో 5 పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, కూకట్‌పల్లి జోన్‌లో 11, సికింద్రాబాద్ జోన్‌లో 12 తాత్కాలిక నిమజ్జన కుంటలను సిద్ధం చేసినట్లు ఆమ్రపాలి వివరించారు.
6/6
గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా 140 స్టాటిక్ క్రేన్‌లు, 295 మొబైల్ క్రేన్లు, 160 గణేష్ యాక్షన్ టీమ్స్, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ మరుగుదొడ్లు కూడా సిద్ధం చేసినట్లు ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా భక్తులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.