రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన మంత్రి
సమాజ్‌వాదీ పార్టీలో అగ్రనాయకుడు, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ తాను చేసిన గ్యాంగ్‌రేప్ వ్యాఖ్యలకు గాను బేషరతుగా క్షమాపణ చెప్పారు. బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఒక రాజకీయ కుట్ర అని ఇంతకుముందు వ్యాఖ్యానించినందుకు బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నట్లు ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఆయన క్షమాపణలను ఆమోదించింది. ఇంతకుముందు ఆయన దాఖలు చేసినవి బేషరతు క్షమాపణలు కాకపోవడంతో.. వాటిని కోర్టు తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఇంతకుముందు ఖాన్ వ్యాఖ్యానించారు.
ఆజంఖాన్ ఇంతకుముందు దాఖలు చేసిన క్షమాపణలను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మహిళల ఆత్మగౌరవం విషయంలో రాజీపడేది లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధితురాలైన బాలికను కేంద్రప్రభుత్వ స్కూల్లో చేర్చి సంరక్షించాలని కోర్టు యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.