వైభవంగా ‘గంగమ్మ’ భక్తి చైతన్య యాత్ర
సాక్షి, తిరుపతి/తిరుపతి కల్చరల్: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో ఐదో రోజైన ఆదివారం భక్తి చైతన్య యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువుల నడుమ గంధం, కుంకుమ బొట్లు ధరించి, వేపాకు చేతపట్టిన జనం భక్తి పారవశ్యంతో చిందులేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ చేశారు. అమ్మవారు, దేవతామూర్తులతో పాటు వివిధ వేషధారణల్లో తమ భక్తిని చాటుకున్నారు.
తొలుత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు తదితరులు అనంతవీధికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అనంతవీధి, పరసాలవీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, గాందీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ తల్లి గుడికి చేరుకుంది.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 విగ్రహాలతో.. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పలువురికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టారు. మాతంగి వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు దరువులు, కోలాటాలు, జానపద నృత్యాలతో నగరమంతా సందడిగా మారింది.
సారె సమర్పించిన మంత్రి రోజా
తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి ఆర్కే రోజా ఆదివారం సారె సమర్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రోజా మాట్లాడుతూ.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. గంగమ్మతల్లి ఆలయానికి సీఎం జగన్‌ను తీసుకువచ్చి, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఈఓ మునికృష్ణయ్య పాల్గొన్నారు.