Gangapur
-
‘పాలమూరు’కు 800 ఏళ్ల చరిత్ర
భూత్పూర్ (దేవరకద్ర): పాలమూరుకు 800 ఏళ్ల చరిత్ర ఉందని, నిజాం నవాబు మహబూబ్ అలీ పేరు మీదుగా జిల్లాగా ఏర్పడిన మహబూబ్‌నగర్ అసలు పేరు పాలమూరు అన్న సంగతి తెలిసిందేనని పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. శనివారం భూత్పూర్ మండలం తాటికొండలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పురాతన కాలం నాటి శిల్పాలు గుర్తించామని ఆయన తెలిపారు. జడ్చర్ల సమీపంలోని గంగాపురం - నెక్కొండ దారిలో రాచమల్ల వారి దొడ్డి పక్కన పొలంలో ఉన్న క్రీ.శ.1,141 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి రెండో జగదేక మల్లుని శాసనంలో పేర్కొన పాల్మురు, పాలమూరేనని పేర్కొన్నారు. కీ.శ.1128 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుని శాసనంలో పేర్కొన్న పిల్లలమర్రి, మహబూబ్‌నగర్ శివారులోని పిల్లలమర్రిగా గుర్తించవచ్చన్నారు. క్రీ.శ.12వ శతాబ్దికే పాలమూరు పట్టణం, పక్కనే పిల్లలమర్రి ఉనికిలో ఉన్నాయన్నారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం
సాక్షి, జడ్చర్ల: ఓ ట్రక్కు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ధాన్యం అమ్ముడుపోక తిరిగి వెళుతున్న ట్రాక్టర్‌ను, ఎదురుగా వస్తున్న బైక్, స్కూటీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు విస్తరణ పనులకు మెటీరియల్‌ను అన్లోడ్ చేసి వస్తున్న కాంక్రీట్ రెడీమిక్స్ ట్రక్కు.. ముందుగా ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ ట్రక్కును నియంత్రించకపోవడంతో అదే వేగంతో ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను సైతం ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్యకు తోడుగా వచ్చిన సురేశ్ (20) ధాన్యం బస్తాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న రవికుమార్ (20), స్కూటీపై వస్తున్న బన్రెడ్డి వెంకటేశ్వర్రావు (32), అతని తండ్రి (52) సైతం దుర్మరణం చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ బాలయ్య, ట్రక్కు డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. కాగా, మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మిర్చి.. కేరాఫ్ గంగాపూర్
డిమాండ్ కూడా ఎక్కువే బాసటగా నిలుస్తున్న పంట రైతన్నల్లో ఉత్సాహం మిగతా పంటలకు గుడ్‌బై గ్రామంలో స్పెషల్ మార్కెట్ ఊరంటే.. కూరగాయలు, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి మొదలైన పంటలు పండించడం మనకు తెలుసు. ఇక్కడ మాత్రం అన్ని పంటలకు స్వస్తి చెప్పి కేవలం మిర్చి పంటను సాగు చేయడం విశేషం. పంట నాణ్యంగా, కారంగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మిర్చికి ప్రత్యేక మార్కెట్ కూడా వెలిసింది. మిర్చి పంట ఇక్కడి రైతులకు బాసటగా నిలవడంతో పాటు మంచి ఉపాధి కల్పిస్తోంది. గంగాపూర్ మిర్చి పంటపై ప్రత్యేక కథనం... చిన్నకోడూరు: గంగాపూర్ గ్రామంలో 450 కుటుంబాలున్నాయి. 1200 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 300 ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. సుమారు 400 మంది రైతులు మిర్చి పంటనే జీవనాధారంగా మలుచుకున్నారు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరిలో గతంలో రైతులంతా వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. రాను రాను వ్యవసాయంలో వస్తున్న మార్పులను గమనించిన రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆరు సంవత్సరాలుగా మిర్చి పంటను సాగుచేస్తున్నారు. క్రమేపి మిర్చి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. వినూత్న పద్ధతుల్లో పంటను సాగు చేస్తూ అత్యధికంగా లాభాలు గడిస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిర్చి సాగు పెరుగుతుండటంతో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయం మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గంగాపూర్‌లో మార్కెట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మార్కెట్‌కు ఇతర గ్రామాల రైతులు కూడా పండించిన మిర్చిని తీసుకురావడంతో మార్కెట్‌కు మంచి గుర్తింపు లభించింది. సిరులు కురిపిస్తున్న మిర్చి భూగర్భ జలాలు అడుగంటి పోయి.. వ్యవసాయ బావులన్నీ వట్టిపోయాయి. ప్రతి యేటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉన్న కొద్ది పాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పం ఆ గ్రామ రైతుల్లో బలపడింది. కొద్ది పాటి నీటితో స్ప్రింక్లర్లు, నీటి గుంతలు, ఫాంపాండ్ల పద్ధతుల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. మిర్చికి మంచి గిట్టుబాటు ధర వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నారు. గత సంవత్సరం మిర్చికి ధర లేకపోవడంతో కొంత నష్టాలు చూసిన రైతులు ఈ సారి అధిక రేటు వస్తుండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు. రోజుకు రూ.15 లక్షల వ్యాపారం... గంగాపూర్‌లోని మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. గంగాపూర్ గ్రామంతో పాటు సిద్దిపేట, చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు మిర్చిని ఈ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తారు. ప్రతి రోజు సమారు 8 వందల బస్తాలు వస్తున్న ఈ మార్కెట్లో రోజుకు రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతుంది. మార్కెట్‌తో 50 మంది హమాలీ కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. గ్రామ పంచాయతీకి కూడా మంచి ఆదాయం వస్తుంది. మిర్చి పంటపైనే ఆధారం... ఉన్న కొద్దిపాటి నీటితో మిర్చి పంట సాగు చేస్తున్నాం. 30 గుంటల్లో మిర్చి పంట సాగు చేశా. పెట్టబడులు పోనూ మంచి లాభం వచ్చింది. ఇక్కడ మార్కెట్ పెట్టడంతో రవాణా భారం తగ్గింది. దీంతో సిద్దిపేటలో చేసే బిజినేస్ మానేసి మిర్చి పంట సాగు చేస్తున్నా. - మహేందర్, రైతు కష్టానికి ప్రతి ఫలం... తనకు ఐదు ఎకరాల సాగు భూమి ఉంది. అందులో రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా. రూ. లక్ష పెట్టబడి పెట్టా. పెట్టబడి పోనూ రూ. 3 లక్షల లాభం వచ్చింది. కష్టానికి ప్రతిఫలం వచ్చింది. గ్రామంలో చాలా మంది రైతులు వరి పంట వేసి నష్టపోకుండా మిర్చి పంట సాగు చేస్తున్నారు. - రాజిరెడ్డి, రైతు -
షార్ట్ సర్క్యూట్‌తో పరికరాలు దగ్ధం
మెదక్ రూరల్ :దొంగ కరెంట్ వాడుతున్న క్ర మంలో గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 40 ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికీలాల్లో తగలబడి పోయాయి. ఈ సంఘటన మండలంలోని గంగాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రా మంలోని 3, 4వ వార్డుల్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ఘటనలో ఇళ్లలోని బల్పులు, టీవీలు, కుక్కర్లతో పాటు ప్లగ్గులో పెట్టి ఉంచిన సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయాయి. దొడ్లె కిరణ్ ఇంట్లో టీవీ కి మంటలు అంటుకుని పెద్దగా మం టలు లేచి ఇంట్లో నిలువ ఉంచిన ధాన్యం బస్తాలు, తలుపులకు మంటలు అంటుకుని ఇతర వస్తువులు కాలిపోయాయి. దీంతో ఆయా ఇళ్లను వదిలిన బాధితులు బయటకు పరుగులు పెట్టారు. అయితే.. ఈ రెండు వార్డులకు విద్యుత్ సరఫరా చేస్తున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ కావడంతో భారీ నష్టం తగ్గింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు రూ. లక్ష మేర నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో లైన్‌మన్ యూసుఫ్ గ్రామానికి చేరుకుని కాలిన వైర్లను సరి చేశాడు. అయితే మీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని లైన్‌మన్‌ను నిలదీశాడు. అక్రమంగా విద్యుత్‌ను వాడే వారిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని, ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.