డిమాండ్ కూడా ఎక్కువే
బాసటగా నిలుస్తున్న పంట
రైతన్నల్లో ఉత్సాహం
మిగతా పంటలకు గుడ్‌బై
గ్రామంలో స్పెషల్ మార్కెట్
ఊరంటే.. కూరగాయలు, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి మొదలైన పంటలు పండించడం మనకు తెలుసు. ఇక్కడ మాత్రం అన్ని పంటలకు స్వస్తి చెప్పి కేవలం మిర్చి పంటను సాగు చేయడం విశేషం. పంట నాణ్యంగా, కారంగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మిర్చికి ప్రత్యేక మార్కెట్ కూడా వెలిసింది. మిర్చి పంట ఇక్కడి రైతులకు బాసటగా నిలవడంతో పాటు మంచి ఉపాధి కల్పిస్తోంది. గంగాపూర్ మిర్చి పంటపై ప్రత్యేక కథనం...
చిన్నకోడూరు: గంగాపూర్ గ్రామంలో 450 కుటుంబాలున్నాయి. 1200 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 300 ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. సుమారు 400 మంది రైతులు మిర్చి పంటనే జీవనాధారంగా మలుచుకున్నారు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరిలో గతంలో రైతులంతా వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. రాను రాను వ్యవసాయంలో వస్తున్న మార్పులను గమనించిన రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆరు సంవత్సరాలుగా మిర్చి పంటను సాగుచేస్తున్నారు. క్రమేపి మిర్చి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. వినూత్న పద్ధతుల్లో పంటను సాగు చేస్తూ అత్యధికంగా లాభాలు గడిస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిర్చి సాగు పెరుగుతుండటంతో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయం మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గంగాపూర్‌లో మార్కెట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మార్కెట్‌కు ఇతర గ్రామాల రైతులు కూడా పండించిన మిర్చిని తీసుకురావడంతో మార్కెట్‌కు మంచి గుర్తింపు లభించింది.
సిరులు కురిపిస్తున్న మిర్చి
భూగర్భ జలాలు అడుగంటి పోయి.. వ్యవసాయ బావులన్నీ వట్టిపోయాయి. ప్రతి యేటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉన్న కొద్ది పాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పం ఆ గ్రామ రైతుల్లో బలపడింది. కొద్ది పాటి నీటితో స్ప్రింక్లర్లు, నీటి గుంతలు, ఫాంపాండ్‌ల పద్ధతుల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. మిర్చికి మంచి గిట్టుబాటు ధర వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నారు. గత సంవత్సరం మిర్చికి ధర లేకపోవడంతో కొంత నష్టాలు చూసిన రైతులు ఈ సారి అధిక రేటు వస్తుండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు.
రోజుకు రూ.15 లక్షల వ్యాపారం...
గంగాపూర్‌లోని మార్కెట్‌లో మిర్చిని కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. గంగాపూర్ గ్రామంతో పాటు సిద్దిపేట, చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు మిర్చిని ఈ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తారు. ప్రతి రోజు సమారు 8 వందల బస్తాలు వస్తున్న ఈ మార్కెట్‌లో రోజుకు రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతుంది. మార్కెట్‌తో 50 మంది హమాలీ కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. గ్రామ పంచాయతీకి కూడా మంచి ఆదాయం వస్తుంది.
మిర్చి పంటపైనే ఆధారం...
ఉన్న కొద్దిపాటి నీటితో మిర్చి పంట సాగు చేస్తున్నాం. 30 గుంటల్లో మిర్చి పంట సాగు చేశా. పెట్టబడులు పోనూ మంచి లాభం వచ్చింది. ఇక్కడ మార్కెట్ పెట్టడంతో రవాణా భారం తగ్గింది. దీంతో సిద్దిపేటలో చేసే బిజినేస్ మానేసి మిర్చి పంట సాగు చేస్తున్నా.
- మహేందర్, రైతు
కష్టానికి ప్రతి ఫలం...
తనకు ఐదు ఎకరాల సాగు భూమి ఉంది. అందులో రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా. రూ. లక్ష పెట్టబడి పెట్టా. పెట్టబడి పోనూ రూ. 3 లక్షల లాభం వచ్చింది. కష్టానికి ప్రతిఫలం వచ్చింది. గ్రామంలో చాలా మంది రైతులు వరి పంట వేసి నష్టపోకుండా మిర్చి పంట సాగు చేస్తున్నారు.
- రాజిరెడ్డి, రైతు
మిర్చి.. కేరాఫ్ గంగాపూర్
Published Mon, May 16 2016 9:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement