తీహార్ జైలు కేంద్రంగా భూదందా
⇒ ఛేదించిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు
⇒ విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు నిందితుల అరెస్టు
⇒ విచారణలో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు
⇒ గ్యాంగ్‌స్టర్ జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ మెంటల్‌గా వెల్లడి
న్యూఢిల్లీ : తీహార్ జైలు కేంద్రంగా కొనసాగుతున్న భూ ఆక్రమణల ముఠాను ఢిల్లీ పోలీసులు బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించిన ఇద్దరి సభ్యులను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2012లో హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ మెంటల్ జైలు కేంద్రంగా భూ దందా కొనసాగిస్తున్నాడని శుక్రవారం పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నజఫ్‌గర్ ప్రాంతంలోని నఫేసింగ్కు చెందిన ప్లాట్‌ను ఆక్రమించుకోవాలని ముఠా సభ్యులైన సోనిపట్‌కు చెందిన బిజేందర్, మరో సభ్యుడు నజఫ్గర్కు చెందిన పవాన్ మాన్‌ను పురమాయించాడు.
ఈ మేరకు అప్పగించిన ప్లాట్ ఆక్రమణ పనిని సభ్యులు పూర్తి చేశారు. డిసెంబర్ 13 ఆ ప్లాట్‌లో నుంచి పొగలు వచ్చాయి. అదేవిధంగా డిసెంబర్ 18న కూడా వచ్చాయి. సమీప ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు డిసెంబర్ 24న ద్వారకాలో చాకచక్యంగా బిజేందర్, పవన్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైం) రవీంద్ర యాదవ్ పేర్కొన్నారు. వీరిని విచారించ గా, ఇంటి యజమానిని భయబ్రాంతులకు గురిచేయడానికి మంటలు పెట్టామని, ఇదంతా మెంటల్ ఆదేశాల ప్రకారమే చేసినట్లు అంగీకరించారు.
మెంటల్ సోదరుడు జగదీప్ తమకు కావల్సిన పేలుడు పదార్థాలను అందజేశాడని చెప్పాడు. బీజేందర్ జైలులో మెంటల్తోపాటు ఉండేవాడు. డిసెంబర్ 4 బెయిల్‌పై బయటకొచ్చాడు. మెంటల్ ఆదేశాల మేరకు విశ్వాసంగా తాను అప్పగించిన పనిని చేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
ఆ ప్లాట్‌ను ఇంతకుముందు ప్రదీప బంకా, అతడి సోదరుడు జస్వంత్ ఆక్రమించుకొన్నారు. ఈ క్రమంలో బంకాను 2012లో మెంటల్ హత్యచేశాడు. ఈ కేసులో అరెస్టు అయి జైలు పాలయ్యాడు. కాగా బంకా సోదరులు ఈ ప్లాట్‌ను నఫేసింగ్కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.