Gannavaram airport development
-
సీఎం జగన్ కృషితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న రన్ వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్,ఎయిర్ పోర్ట్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.470 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. 3.5 లక్షల స్క్వేర్ ఫీట్స్ లో భవన నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. (చదవండి: కోవిడ్ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..) ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం జరిగితే ఆంధ్రరాష్ట్రానికే తలమానికంగా నిలువనుందన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ మంజూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ) ఆమోదం తెలిపింది. సుమారు రూ.613 కోట్లతో నిర్మించనున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఇక లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పాత టెర్మినల్ భవనాన్ని ఇంటర్నేషనల్ కార్యకలపాలకు తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను నిర్మించడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఐదు నిర్మాణ రంగ కంపెనీలు బిడ్డులు దాఖలు చేయగా అందులో ఒక కంపెనీ సాంకేతిక అంశాల విషయంలో తిరస్కరణకు గురైంది. మిగిలిన నాలుగు కంపెనీల్లో ఎన్‌కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తక్కువ ధరను కోట్ చేయడం ద్వారా ఎల్1గా నిలిచినట్లు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగానే పనులు మొదలుపెట్టి రెండేళ్లలో టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
విమానాశ్రయంలో మరిన్ని వసతులు
పెరిగిన అవసరాల కనుగుణంగా టెర్మినల్ భవనం మార్చాలి ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై సమీక్షలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు గన్నవరం : పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని మార్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. విజయవాడను రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించేందుకు ఆయన లాంజ్రూములో గురువారం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, జీవీకే సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం అధికారులు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. పెరిగిన విమాన సర్వీసులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ప్రయాణికులు కూర్చునేందుకు సదుపాయాలు లేవని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. భద్రత కూడా సరిగా లేదన్నారు. ఇంటర్ భవనం ప్లాన్ పరిశీలన ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు గాను తాత్కాలిక టెర్మినల్ కోసం సుమారు రూ.105 కోట్లతో జీవీకే సంస్థ నిర్మించనున్న ఇంటర్ భవనం ప్లాన్‌ను ఆ సంస్థ ప్రతినిధులు అశ్విన్ తొరట్, చంద్రభాన్ మన్వానీ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భవనంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేయనున్న వసతుల గురించి తెలియజేశారు. ఈ భవనం నిర్మించడం వల్ల సమీపంలో ఉన్న రాడార్ (డీవీవోఆర్) కేంద్రం ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అందాల్సిన సిగ్నల్స్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుందని, ఆ కేంద్రాన్ని మరోచోటకు తరలించేందుకు అత్యవసరంగా కొంత ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. భూసేకరణ పూర్తయి, భవిష్యత్తులో శాశ్వత టెర్మినల్‌ను నిర్మించిన తర్వాత ఈ ఇంటర్ భవనాన్ని కార్గో సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇంటర్ భవన నిర్మాణానికి ఏడాదిన్నర పడుతుందని మంత్రికి వివరించారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను 200 నుంచి 300 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అనువుగా, ఆకర్షణీయంగా రెండు, మూడు నెలల్లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. ఇందుకోసం ఏవియేషన్ రంగంలో అనుభవం ఉన్న జీవీకే సంస్థ ప్రతినిధుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి విశాఖపట్నం విమానాశ్రయం దెబ్బతిన్నప్పటికీ ఐదు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి యథాస్థితికి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. మరో 220 ఎకరాల భూమి కావాలి అన్ని రకాల విమానాలూ దిగేందుకు వీలుగా రన్‌వేను 14,500 అడుగులకు విస్తరించాల్సి ఉందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకోసం గతంలో భూసేకరణ నిమిత్తం నోటీసులు జారీచేసిన 450 ఎకరాలతో పాటు మరో 220 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌ఈడీ ఎస్‌హెచ్ సురేష్, ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ : ఎమ్మెల్యే వంశీ రైతులకు నష్టం లేకుండా విమానాశ్రయ భూసేకరణను ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం 440 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. రన్‌వేను పూర్తిస్థాయిలో విస్తరించేందుకుగాను ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు మరో 220 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూములను రైతులందరి ఆమోదం మేరకు సేకరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. మెరుగైన ప్యాకేజీ, భూసమీకరణ పద్ధతుల్లో రైతులను సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు. ఈ నెల 13న కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
శరవేగంగా ఎయిర్ పోర్టు అభివృద్ధి
సాక్షి, విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్టును శరవేగంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రతిపాదనలు, సర్వేలు పూర్తి చేసి త్వరితగతిన పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం జిల్లా అభివృద్ధి, ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడ నగరాభివృద్ధి, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విజయవాడ-గుండుగొలను జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడలోని కాలువల ఆధునికీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు సంబంధిత విభాగాల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గన్నవరం ఎయిర్‌పోర్టును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రధానంగా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని పెంచేందుకు ఏ మేరకు చర్యలు తీసుకోవాలి.. ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరగడానికి ఏంచేయాలి.. అనే అంశాలపై సమీక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సింగపూర్ తరహాలో కాలువలపై కూడా రన్‌వే నిర్మించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయో.. లేదో.. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని చెప్పారు. విజయవాడలో కాలువల ఆధునికీకరణకు తొలి విడతగా రూ.11.6 కోట్లు విడుదలకు తక్షణమే అనుమతులిస్తానని ప్రకటించారు. ఎక్కడా లేనివిధంగా విజయవాడలో కాలువలు ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని సుందరీకరించడం ద్వారా జలమార్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, దీనిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలరవాణాకు తక్కువ ఖర్చు కేంద్ర ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల్లో జలమార్గాన్ని ప్రస్తావించానని సీఎం చెప్పారు. జలమార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా బొగ్గు, ఖనిజ సంపద తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి వీలుందటుందనీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. విజయవాడను మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేయాలని ఆదేశించారు. విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న పట్టణాలను కలుపుతూ మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఫ్లై ఓవర్లను నిర్మించాలన్నారు. బెంజిసర్కిల్ నుంచి నాలుగు ఆధునిక ఫ్లైఓవర్లను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పారు. దీని కోసం మంచి కన్ల్టెన్సీలను సంప్రదించాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సలహాలను తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. విజయవాడను లాజిస్టిక్ హబ్‌గా తీర్చుదిద్దుతానని సీఎం చెప్పారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని శ్రీవల్లి కాల్వల సుందరీకరణపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సీఎం తిలకించారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, బొండా ఉమా, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, సీపీ శ్రీనివాస్, జేసీ జె.మురళి, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.