గన్నవరం-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం
గన్నవరం: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఎయిరిండియా రెండో విమాన సర్వీసు మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోకగజపతిరాజు గురువారం ఉదయం సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు 14 మంది ప్రయాణికులతో విమానం గన్నవరం చేరుకుంది. విజయవాడ, బందరు, ఏలూరు ఎంపీలు కేశినేని శ్రీనివాస్(నాని), కొనకళ్ల నారాయణరావు, మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు వారికి స్వాగతం పలికారు.
అనంతరం 10 గంటలకు ఎంపీ కొనకళ్లతో సహా 30 మందితో విమానం తిరిగి న్యూఢిల్లీ వెళ్లింది. ఎయిర్పోర్టు డెరైక్టర్ రాజ్కిషోర్ మాట్లాడుతూ ఈ విమానం ప్రతిరోజు ఉదయం 6.20 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 8.25 గంటలకు గన్నవరం చేరుకుంటుందని చెప్పారు. తిరిగి 9 గంటలకు బయలుదేరి 11.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని వివరించారు.