garbage piles up
-
చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు
బనశంకరి: రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్ వద్ద పట్టాల పక్కన ఎస్కే సాల్మన్ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్కే సాల్మన్ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్లు కనిపించాయి. ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఈ విషయం చెప్పాడు. తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడు. కానీ భయపడ్డ సాల్మన్.. రెండురోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్.కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా ఈ సంగతిని నగర పోలీస్ కమిషనర్ దయానందకు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్‌ను, నగదును తీసుకుని కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదని పోలీసులు చెప్పారు. బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఒక పెద్ద లెటర్ కూడా అందులో ఉండటం విశేషం. అంత డబ్బును చూశాక తాను ఉద్వేగంతో ఒక రోజంతా నిద్రపోలేదని సాల్మన్ చెప్పాడు. -
రాజధానిలో 'చెత్త' రాజకీయం
దేశ రాజధానిలో ఇప్పుడు చెత్త రాజకీయం రాజ్యమేలుతోంది. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడ చూసినా భారీ ఎత్తున చెత్త పేరుకుపోతోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగా.. బీజేపీ చేతిలో మునిసిపల్ కార్పొరేషన్ ఉంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పాలకవర్గం రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే మొత్తం ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చీపుళ్లు పట్టుకుని వీధులు తుడుస్తామని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం పీడబ్ల్యుడీ కార్మికులు కొంతమేరకు పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు. పార్టీ వలంటీర్ల సాయం కూడా తీసుకుని చెత్తను శుభ్రం చేయిస్తామని ఆప్ వర్గాలు అంటున్నాయి. ఎక్కడైనా చెత్త పేరుకుపోతే పౌరులు కాల్ చేసేందుకు వీలుగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎంసీడీకి ఈ చెత్తను క్లియర్ చేసే సామర్థ్యం లేదని, త్వరలోనే నగరంలో పేరుకున్న చెత్తను ఎత్తేయించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని మిశ్రా తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేలాది మంది బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆప్.. పార్టీ రాజకీయాలకు పాల్పడుతోందని, కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. మూడు కార్పొరేషన్లకు రూ. 3వేల కోట్లు విడుదల చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు.