బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ
Sir Garfield Sobers Trophy 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఈ ఏడాది ఐసీసీ అవార్డుల పంట పండింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్న బాబర్.. తాజాగా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇందుకు గానూ ఐసీసీ బాబర్‌ను సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ-2022తో సత్కరించింది.
ఈ అవార్డు రేసులో బాబర్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడినప్పటికీ, ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ బాబర్ వైపే మొగ్గుచూపింది. బాబర్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌ల్లో 54.12 సగటున 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఐసీసీ బాబర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
Double delight for Babar Azam 🤩After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards— ICC (@ICC) January 26, 2023
2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్.. వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి తర్వాత వరుసగా రెండో ఏడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. 2022లో బాబర్ 9 వన్డేల్లో 84.87 సగటున మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 679 పరుగులు చేశాడు.
ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న బాబర్.. దాదాపు ఏడాదిన్నరగా ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు.
మరోవైపు, ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నతాలీ సీవర్ గెలుచుకుంది. సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు, 1346 పరుగులు చేసింది. ఈ అవార్డుకు ముందు సీవర్ 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది.
England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards— ICC (@ICC) January 26, 2023
ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్నందుకు గానూ ఐసీసీ సీవర్‌ను రేచల్ హేహోయ్ ఫ్లింట్ ట్రోఫీతో (Rachael Heyhoe Flint Trophy) సత్కరించింది. కాగా, మెన్స్, వుమెన్స్ విభాగంలో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2022) గెలిచిన ప్లేయర్లు (బాబర్, సీవర్) ఐసీసీ క్రికెటర్ అఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం.