నగరవనం.. పర్యాటకానికి సిద్ధం
- నేటి సాయంత్రం ప్రారంభం
- ప్రముఖుల హాజరు
కల్లూరు (రూరల్) : నగరం, పరిసరా గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సిటీ ఫారెస్ట్ సిద్ధమైంది. నగర శివారులోని గార్గేయపురం చెరువు పక్కనే అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.1.5 కోట్ల వ్యయంతో నగర వనాన్ని అటవీ శాఖాధికారులు అభివృద్ధి చేశారు. 325 హెక్టార్లలో ప్రకృతి అందాల నడుమ వాకింగ్ ట్రాక్‌తో పాటు పగోడా షెల్టర్, యోగా సెంటర్, వాచ్‌టవర్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నక్షత్రవనం, రాశీవనం, పంచంటి, లక్ష్మీవనం, వినాయక వనం ఏర్పాటు చేసి రకరకాల పూల మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. 850 అడుగుల ఎత్తులో వాచ్టర్ నిర్మించారు. దీనిపై నుంచి తుంగభద్ర, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలు, అలంపూర్ గ్రామాన్ని చూడొచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. గార్గేయపురం చెరువులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో స్పీడ్ బోటింగ్ వసతి కల్పించారు. పర్యాటకులకు కనువిందు చేసేందుకు సిద్ధమైన నగరవనాన్ని బుధవారం సాయంత్రం 5గంటలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, అటవీశాఖమంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించనున్నారు. శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్, పార్లమెంట్ సభ్యులు బుట్టారేణుక, ఎస్పీవై రెడ్డి పాల్గొంటారు. ఇదేరోజు ఉదయం ఆత్మకూరులోని బైర్లూటి కాటేజీని ప్రారంభిస్తారు.