మొన్న శత్రువుతో.. నేడు ప్రాణాలకోసం
గరుడ్ కమాండో శైలేష్ పోరాటం
పఠాన్‌కోట్: జనవరి 2న రాత్రి రెండు గంటలకు ఉగ్రవాదుల చొరబాటు వార్తతో అప్రమత్తమై రంగంలోకి దిగి.. శత్రువులతో పోరాడిన గరుడ కమాండో శైలేష్ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మెకానికల్ ట్రాన్స్‌పోర్టు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసి వారిని నిలువరించేందుకు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 12 మంది గరుడ్ కమాండోలను మోహరించారు. ఉగ్రవాదులను కాసేపు అక్కడే నిలువరించేలా కాల్పులు జరపాలని ఈ కమాండోలకు ఆదేశాలందాయి. దీంతో గురుసేవక్ ఓ భారీ యంత్రం పక్కన నక్కి ఉగ్రవాదులపై కాల్పులు మొదలుపెట్టారు.
ఉగ్రవాదుల ఎదురుదాడిలో మూడు బుల్లెట్లు తగిలినా.. కాసేపు పోరాడిన తర్వాత గురుసేవక్ నేలకొరిగారు. వెంటనే పొజిషన్ తీసుకున్న శైలేష్ కాల్పులు ప్రారంభించారు. అయితే.. ఎదురుకాల్పులతో శైలేష్‌కు కడుపు కింది భాగంలో ఆరు బుల్లెట్లు దిగాయి. అయినా ధైర్యం కోల్పోకుండా శైలేష్ కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
వీరి పోరాటం వల్ల ఉగ్రవాదులు మెకానికల్ ఏరియా దాటి టెక్నికల్ ఏరియాలోకి వెళ్లలేక ఆగిపోయారు. అదే జరిగి ఉంటే ఎయిర్‌బేస్ పూర్తిగా ఉగ్రవాదుల హస్తగతమయ్యేది. తెల్లవారిన తర్వాత(అంటే బుల్లెట్ గాయాలు తగిలిన మూడు గంటల తర్వాత) శైలేష్‌తో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీరుడు ఆసుపత్రిలో ప్రాణం కోసం పోరాడుతున్నారు.