వెన్నెల్లో వెంకన్న
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల: తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడ సేవ భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు ప్రత్యేకంగా గరుడసేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్య కైంకర్యాలు ముగించుకున్న మలయప్పస్వామిని వాహన మండపంలో వేంచేపు చేశారు. పుష్పమాలలు, బంగారు, వజ్రవైఢూర్య మరకత మాణిక్యాదులతో కూడిన ఆభరణాలను ఉత్సవమూర్తికి విశేషంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేద ఘోష, భక్తుల గోవింద నామస్మరణల మధ్య వాహన ఊరేగింపును రాత్రి 7 గంటలకు ఆరంభించారు.
సంగీత ధ్వనుల్లో, చల్లటి గాలుల నడుమ గరుడుడిపై ఊరేగుతూ మలయప్ప స్వామివారు భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి గరుడసేవను వీక్షించలేని భక్తులు శనివారం జరిగిన పౌర్ణమి గరుడ వాహనాన్ని కనులారా వీక్షించి సర్వాలంకార భూషితుడైన స్వామిసేవలో తరించారు. శనివారం గురుపౌర్ణమి కావడంతో ఉత్సవానికి విశిష్టత మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, విజిలెన్స్ అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఇతర అధికారులతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.