శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగింది
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి వచ్చిన తర్వాత.. తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలుగుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో రూ. 190 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన గరుడ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతోందని, తిరుపతికి కూడా పర్యాటక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడం వల్ల అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. కేవలం పెద్ద సంస్థలే కాక, పండ్లు అమ్ముకునేవాళ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చాక్లెట్లు అమ్ముకునేవాళ్లు.. చివరకు 'చాయ్' అమ్ముకునేవాళ్లు కూడా పర్యాటకం వల్ల మంచి ఆదాయం పొందగలరని ఆయన చెప్పారు.
తిరుపతి బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసుడి పవిత్రభూమికి వచ్చానని, ఇది తనకెంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపి, అక్కడి నుంచి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.