సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత
కంప్లి : సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత ఏర్పడుతోందని శరత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కే.రవికుమార్ అన్నారు. వినియోగదారులు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
తమ ఏజెన్సీ కింద 16,500 మంది వినియోగదారులున్నారని, ప్రస్తుతం ప్రధాన కేంద్రం నుంచి నెలకు 10 వేల సిలిండర్లు రావాల్సి ఉందన్నారు. 2013 ఆగస్టులో తమకు 10424 సిలిండర్లు అందగా, 2014 ఆగస్టు నాటికి వాటి సంఖ్య 7,700లకు త గ్గిందని, దీంతో సమస్య ఉద్భవించిందన్నారు. ప్రతి నెల కుటుంబానికి ఒక సిలిండర్ అందించాలనే ఆదేశాలుండగా దానికి అనుగుణంగా తమకు సరఫరా లేదన్నారు.
ప్రస్తుతం తాము ప్రతి కుటుంబానికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలంటే మధ్యాహ్న భోజన పథకం హాస్టళ్లు, పాఠశాలలతో కలిపి 10 వేల సిలిండర్లు అవసరమవుతుండగా, కేవలం 7,700 సిలెండర్లు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య అక్టోబర్ వరకు తప్పదని గ్యాస్ ప్రధాన కేంద్రం ప్రకటించిందన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా కోసం 180 లారీలు అవసరముండగా, ప్రస్తుతం 60 లారీలు మాత్రమే ఉన్నందున సిలిండర్లు సకాలంలో అందడం లేదన్నారు.
లారీలతో సప్లయ్ చేసేందుకు ఆగస్టు 26న టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఒకటిన్నర నెలపడుతుందన్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్లే పంపిణీ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్లో సిలిండర్ల అమ్మకం చేసే ప్రశ్నే లేదన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు వినియోగదారులుంటారని, ఆ నలుగురికి తాము నాలుగు సిలిండర్లు పంపిణీ చేస్తామని, వారి వద్ద అదనంగా సిలిండర్లు ఉన్నందున వారు అమ్ముకుంటే దానికి తాము బాధ్యులమా? అని ఎదురు ప్రశ్నించారు.