అధనపు భారం
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల రవాణా ముసుగులో యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. రవాణా చార్జీ పేరుతో వినియోగదారులపై ఏజెన్సీల యజమానులు అదనపు భారం మోపుతున్నారు. డెలివరీ బాయిస్‌కు ఏజెన్సీల యజమానులే రవాణా చార్జీలు చెల్లించవలసి ఉండగా వినియోగదారుల నుంచి ఆసొమ్మును వసూలు చేయిస్తున్నారు. అర్బన్, రూరల్ తేడా లేకుండా వసూళ్లకు తెగబడుతున్నారు. ఏటా సుమారు రూ.11.97కోట్ల మేర అదనపు మోత మోగిస్తున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ముడుపుల భాగోతంతో సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్యాస్ ఏజెన్సీకి ఐదు కిలోమీటర్ల లోపు వినియోగదారులుంటే బిల్లులో ఉన్న ఎంఆర్పీ మేరకు సిలిండర్లు సరఫరా చేయాలి. రవాణా చార్జీ వసూలు చేయకూడదు. ఐదు కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల లోపైతే ఎంఆర్పీకి అదనంగా రూ.10 తీసుకోవాలి. 30 కిలోమీటర్లు దాటితే రూ.15 వసూలు చేయాలి. అయితే, ఇదెక్కడా అమలు కావడం లేదు. అర్బన్, రూరల్ అన్న తేడా లేకుం డా అదనంగా వసూలు చేసేస్తున్నారు. సాధారణంగా
అర్బన్ ఏరియాలో ఏజెన్సీలకు ఐదు కిలోమీటర్ల లోపే వినియోగదారులుంటారు. ఈ లెక్కన రవాణా చార్జీ ఉచితం కావాలి. కానీ జిల్లాలోని అర్బన్ ఏరియాలోని ప్రతిచోటా రూ. 25 నుంచి రూ. 31 వసూలు చేస్తున్నారు. రూ.654కి అందజేయాల్సిన సిలిండర్ కు రూ.680 నుంచి రూ.685 వసూలు చేస్తున్నారు. పలు చోట్ల సిలిండర్ సరఫరా దారులను ఎందుకిలా వసూలు చేస్తున్నారని అడిగితే ఏజెన్సీలకు మాకేమీ ఇవ్వవని, మీరిచ్చేది దక్కుతుందని చెబుతున్నారు.
రూరల్ ఏరియాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణంగా ఏజెన్సీకి 30 కిలోమీటర్ల లోపే వినియోగదారులుంటారు. ఈలెక్కన సిలిండర్‌పై రూ.10 మాత్రమే రవాణా చార్జీ కింద వసూలు చేయాలి. కానీ జిల్లాలో ప్రతి చోటా రూ.30 నుంచి రూ. 36 వసూలు చేస్తున్నారు. ఏ గ్రామానికెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఒక్కొక్క సిలిండర్‌పై సరాసరి రూ.25 అదనంగా వసూలు చేస్తున్నట్టు అవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 2,08,177 సాధారణ కనె క్షన్లు ఉన్నాయి. వీటికి 21రోజులకొక సిలిండర్ సరఫరా చేస్తారు. అంటే ఏటా 35లక్షల 39వేల తొమ్మిది సిలిండర్లు విడుదలవుతున్నాయి. ఈ లెక్కన సాధారణ వినియోగదారులపై ఏటా రూ.8 కోట్ల 84లక్షల 75వేల 225మేర అదనపు భారం పడుతోంది.
దీపం పథం కింద జిల్లాలో లక్షా 4వేల 250గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరికి నెలకొకటి చొప్పున ఏటా 12లక్షల 51వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. వీటిన్నింటికీ గాను రవాణా కింద ఏటా రూ.3కోట్ల 12లక్షల 75వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విధంగా అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు, ఇటు దీపం పథకం లబ్ధిదారులపై ఏటా సుమారు రూ.11కోట్ల 97లక్షల 50వేల అదనపు భారం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. దీనికంతటికీ ముడుపుల భాగోతమే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.