Gas insulated substation
-
జీఐఎస్ సబ్‌స్టేషన్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్ చేసింది. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ గ్యాస్ విద్యు త్ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 870 మెగావాట్ల విద్యుత్.. మేడారం పంపింగ్ స్టేషన్లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్ లైన్ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్ చార్జింగ్ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
వామ్మో...! పెద్ద స్కెచ్
సాక్షి, అమరావతి బ్యూరో : ట్రాన్స్‌కో నిబంధనలను మార్చి కాంట్రాక్టు దక్కించుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న నానా యాగీ వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు రూ.640 కోట్ల కాంట్రాక్టులను ఏక పక్షంగా దక్కించుకునే ‘దూరా’లోచన బట్టబయలవుతోంది. ఆ కథాకమామిషు ఇది.... ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ కాంట్రాక్టుల కోసం విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి పెద్ద గూడుపుఠాణీ సాగిస్తున్నారు. మొగల్రాజపురంలో రూ.10కోట్లతో నిర్మించదలచిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కోసం ఆయన ఒత్తిడి చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘పార్టీ మాదే... టెండర్ మాకే’ శీర్షికన బట్టబయలు చేసింది. అర్హత నిబంధనలు మార్చి తమకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ఆయన పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేమిటంటే... రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. మొగల్రాజపురంలోని సబ్‌స్టేషన్ కంటే అధిక సామర్థ్యమైనవి నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్లు 16 నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో సబ్‌స్టేషన్ అంచనా వ్యయం రూ.40 కోట్లు చొప్పున మొత్తం రూ.640కోట్లుతో నిర్మిస్తారు. అమరావతిలో మొదటి సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఈ నెలలో టెండర్లు పిలవాలని ట్రాన్స్‌కో భావిస్తోంది. అనంతరం మిగిలిన 15 సబ్స్టేషన్ల కోసం కూడా రానున్న రెండేళ్లలో దశలవారీగా టెండర్ల ప్రక్రియ చేపడతారు. రూ.640 కోట్ల భారీ కాంట్రాక్టు కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను వాటిపై పడింది. అందుకే ప్రజాప్రతినిధి వీరంగం... గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కోసం ట్రాన్స్‌కో రూపొందించిన నిబంధనలు టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్రాజపురం టెండర్ నోటిఫికేషన్లో అర్హత నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ నిర్మించిన అనుభవం ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి ఓ సంస్థ పేరున టెండరు దక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆ సంస్థకు కూడా గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ నిర్మించిన అనుభవం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.10కోట్ల మొగల్రాజపురం సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఆ సంస్థ పోటీపడ లేదు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోదు. అమరావతిలో నిర్మించనున్న 16 సబ్‌స్టేషన్లకూ అవే టెండర్ నిబంధనలు వర్తింపజేస్తారు. అలా అయితే ఆ రూ.640కోట్ల భారీ కాంట్రాక్టు కూడా టీడీపీ ప్రజాప్రతినిధికి దక్కకుండాపోతుంది. అందుకే ప్రస్తుతం మొగల్రాజపురం సబ్‌స్టేషన్ టెండర్ నిబంధనలు మార్చాలని ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలకు అవకాశం కల్పించడం సరైన విధానం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు సబ్స్టేషన్ల వంటి కీలకమైన మౌలిక వ్యవస్థల నిర్మాణంలో రాజకీయాలకు తలొగ్గుతోందని విమర్శిస్తున్నారు.