శాసనమండలి ప్రశ్నోత్తరాలు
మధ్యాహ్న భోజనంలో గౌరవ వేతనం పెంపు లేదు: గంటా
హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకంలో వంట వారికి చెల్లిస్తున్న వెయ్యి రూపాయల గౌరవవేతనం పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం శాసనమండలికి తెలిపారు.
2.51 లక్షల మందికి పంటల బీమా: ప్రత్తిపాటి
ఏపీలో ఈ ఆర్థిక ఏడాదిలో 2.51 లక్షల మంది రైతులు పంటల బీమా సదుపాయం వినియోగించుకున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న 2.31 లక్షల మంది పంట లను బీమా చేయించుకున్నారని చెప్పారు.
అమ్మహస్తం కొనసాగించడం లేదు: మంత్రి సునీత
అమ్మ హస్తం పథకం ద్వారా 9 రకాల సరుకులు అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగించడం లేదని మంత్రి పరిటాల సునీత చెప్పారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
ఇసుక సీనరేజీ రూ. 5.07 కోట్లు
కొత్త ఇసుక విధానం ప్రకటించాక అమ్మకాలపై ఈ నెల 17వరకు రూ.5.07 కోట్లు సీనరేజీ రూపేణా వసూలైనట్లు మంత్రి పీతల సుజాత శాసనమండలికి తెలిపారు.