బాలయ్య సినిమా చాలా ఛాలెంజింగ్
జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు క్రిష్‌తో మరోసారి కలిసి పనిచేస్తున్న సంగీత దర్శకుడు.. చిరంతన్ భట్. బాలకృష్ణ వందో సినిమాగా తీస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు కూడా చిరంతన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు పనిచేయడం చాలా ఛాలెంజింగ్గాను, ఆసక్తికరంగా కూడా ఉంటుందని భట్ చెప్పాడు. ఇంతకుముందు క్రిష్‌తో కలిసి కంచె సినిమాకు పనిచేసిన అనుభవం భట్‌కు ఉంది. క్రిష్‌కు ఏం కావాలో ఆయనకు సరిగ్గా తెలుసని, ఆయనకు మంచి సంగీత జ్ఞానం కూడా ఉందని.. అందువల్ల తమ పని సులభం అయిపోతుందని చెప్పాడు.
ఇక కంచె లాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా పీరియాడికల్ డ్రామా అని, అందువల్ల తాను కోరుకున్న ఇన్స్ట్రుమెంట్లు వాడే స్వేచ్ఛ తనకు అంతగా ఉండదని తెలిపాడు. చాలావరకు మెలోడిలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ప్రయోగాలు చేయడానికి అంతగా అవకాశం ఉండబోదని చెప్పాడు. అదే సమయంలో మంచి సంగీతం కూడా ఇవ్వాలనడమే బాగా ఛాలెంజింగ్ అని అన్నాడు. తనపై చాలా ఒత్తిడి ఉందని, అయితే సాధారణ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇవ్వడం కంటే ఇలాంటి వాటికి బాగా చేసి మంచిపేరు తెచ్చుకోవడం మరింత బాగుటుందని చెప్పాడు.