ప్రియురాలిపై విరుచుకుపడ్డాడు.. జైలుకెళ్లాడు..!
పాట్నా: బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఉన్న ఓ యువకుడు ప్రేయసిని చితకబాదాడు. ఈ ఘటన బిహార్ లోని గయ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గయ పట్టణంలో లవర్స్ మధ్య చిన్న గొడవ తలెత్తింది. క్షణికావేశంలో లవర్ ఆ టీనేజీ యువతిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఇది గమనించిన స్థానికులు ప్రియుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ యువకుడిని గయ పోలీసులకు అప్పగించారు.
ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన టీనేజీ యువతిని గయలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం పాట్నాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధిత యువతిని పాట్నాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.