సర్వేకు సహకరించేనా..?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ నెల 19న చేపట్టబోయే సామాజిక సర్వేపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముంపు మండలాల్లో పాలనా వ్యవహారాలు జిల్లా నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా సామాజిక సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. మరోవైపున ఈ మండలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నెలాఖరునాటికి ఆ మండలాలను విలీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించింది. కానీ జిల్లా యంత్రాంగం మాత్రం ముంపు మండలాల్లో కూడా సామాజిక సర్వే చేపట్టాలని కార్యాచరణ ప్రకటించింది. ఈ మొత్తం పరిణామాలు ఇక్కడ పనిచేసే అధికారులను ఇరకాటంలో పడేస్తున్నాయి. ముంపు మండలాల్లోని ప్రజాప్రతినిధుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తుండటంతో సర్వేకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారు ఆలోచనలో పడ్డారు. ఏడు మండలాల్లో 324 రెవెన్యూ గ్రామాలు, వాటిలో నివసిస్తున్న 1,90,304 మంది జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడ్డారు.
తాము మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల్లో నమోదు కావాల్సి ఉంటుందని, అలాంటప్పుడు తమ సమగ్ర సమాచారాన్ని సేకరించి ఏం ప్రయోజనమని కొంతమంది సర్పంచ్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటిలోని అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న ఈ సామాజిక సర్వేతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా అధికారులు చెపుతున్నారు. ఒక వేళ ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పటకీ, సర్వే నివేదికను వారికి అప్పగిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
సర్వేపై భద్రాద్రిలో సర్పంచ్ల నిరసన...
సామాజిక సర్వే సవ్యంగా సాగేలా సర్పంచ్‌లకు సోమవారం భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేకు సహకరించి ప్రజల సమగ్ర సమాచారం అందేలా చూడాలని తహశీల్దార్ రాజేంద్రకుమార్ సర్పంచ్‌లను కోరారు. ఈ దశలో కొంతమంది సర్పంచ్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ గ్రామాలను బదలాయించారని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సర్వేలని నిలదీశారు.
గతంలో ఉన్న భూములను అవసరాల కోసం అమ్ముకున్నామని, కానీ ఏజెన్సీ చట్టాల ప్రకారం అవి తమ హ క్కుపత్రాల నుంచి మాత్రం వేరు కాలేదని, అలాంటప్పుడు తమ ఆస్తుల వివరాలను ఏ రీతిన నమోదు చేసుకోవాలని వెంకటరెడ్డిపేట ఉపసర్పంచ్ కృష్ణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తమలాంటి వారికి నష్టమే జరుగుతుందని, తీరా సర్వే జరిగిన తరువాత ఆంధ్రలోకి వెళ్లాల్సి వస్తుందని, ఈ లోగానే తమకు ఉన్న రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు రద్దయ్యే ప్రమాదం ఉందని మరికొందరు సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
రంపచోడవం ఆర్డీవోను కలిసిన ముంపు సర్పంచ్‌లు..
చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన 24 మంది సర్పంచ్‌లు సోమవారం రంపచోడవరం వెళ్లి ఆర్డీవోను కలిశారు. ఈ సందర్భంగా ముంపు మండలాల సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాల విభజన నేపథ్యంలో ముంపు మండలాల్లో గత కొంతకాలంగా ఎటువంటి అభివృద్ధి పనులు జరుగటం లేదని, వీటిని ఆంధ్రలో కలిపినందున ఇప్పటికైనా అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ముంపు మండలాలకు ప్రత్యేకాధికారి..
ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను తమ అజమాయిషీ కిందనే సాగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముంపు మండలాల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా బదలాయించిన ఏడు మండలాలకు ఓ ప్రత్యేకాధికారిని నియమించేందుకు కేబినెట్లో ఆమోదించినట్లు సమాచారం. దీంతో ముంపు మండలాలను తమ పాలన కిందకు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది.