GB Road
-
నీడలకు రెక్కలు
గోడలు అడ్డు తప్పుకోవు. దూకేసి వెళ్లాలి. లేదంటే.. పడగొట్టుకుని వెళ్లాలి. రెడ్ లైట్ ఏరియాలో రెండూ కష్టమే. అక్కడ నీడలు కూడా గోడలే. తల్లులు గోడలు.. కూతుళ్లు నీడలు! ఆ నీడలకు.. రెక్కలు కడుతున్నాడు గంభీర్. చదువుల రెక్కలవి. ఎన్నికల సమయం. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రాజకీయ అనుభవం లేదు. అనుభవం అవసరం అని కూడా అతడు అనుకోలేదు. ఏప్రిల్ నుంచి ఎన్నికలైతే, మార్చిలో రాజకీయాల్లోకి వచ్చాడు. అతడి మీద పోటీలో ఉన్నది అతిషీ సింగ్. అతడి వయసే. రాజకీయ అనుభవంలో మాత్రం సీనియర్. ‘ఆప్’ పార్టీ అభ్యర్థి. ఆ సీనియర్ని ఓడించాడు గంభీర్. 4 లక్షల 77 వేల ఓట్ల తేడాతో ఓడించాడు! రూలింగ్ పార్టీ అభ్యర్థి అనీ, మాజీ క్రికెటర్ అనీ అంత మార్జిన్ రాలేదు. అతడు ఎన్నికల్లో నిలబడక ముందు నుంచే, పద్మశ్రీ అవార్డు రాకముందే, అసలు క్రికెట్ నుంచి రిటైర్ అవడానికి నాలుగేళ్ల ముందు నుంచే గంభీర్ జనానికి తెలుసు. జనం అంటే.. నిద్రతో పస్తుల కడుపును నింపుకుంటున్నవారు. మిలటరీలో పని చేస్తున్న ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పిల్లలు. గూడు లేని అభాగ్యులైన ఆడపిల్లలు. వాళ్లకు అన్నం పెట్టాడు. చదువు చెప్పించాడు. వాళ్ల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. ఉపాధి కల్పించాడు. ఢిల్లీ నగరానికి కూడా కొంత చేశాడు. పచ్చటి మొక్కల్ని నాటించి కాలుష్యాన్ని తగ్గించే పనిని గడ్డిమోపులా తలమీదకు ఎత్తుకున్నాడు! ఇప్పుడు ఢిల్లీలోని సెక్స్ వర్కర్ల పిల్లల సంరక్షణను భుజాన వేసుకున్నాడు. ఆ బాధ్యతకు అతడు పెట్టుకున్న పేరు ‘పంఖ్’. అంటే రెక్కలు. అయిష్టమైన బతుకుల నుంచి ఆడపిల్లలకు వారు కోరుకున్న కెరీర్లో ఎదిగేలా, ఎగిరేలా రెక్కల్ని తొడగడమే ‘పంఖ్’. గంభీర్ ఎప్పుడూ మాట్లాడుతూ కనిపించడు. ఆలోచనల్లో ఉండేవాళ్లు మౌనం దాల్చడం సహజమే. క్రికెట్లోనూ అంతే, ఇప్పుడు రాజకీయాల్లోనూ అంతే. చేయడమే అతడు మాట్లాడ్డం. ‘‘ఎందుకలా ఉంటారు మీరు?’’ అని ఓ ఇంటర్వూ్యలో గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘పనిలో ఉన్నప్పుడు మాట్లాడను’’ అన్నాడు. పదో యేట క్రికెట్లోకి వచ్చినప్పటి నుంచే గంభీర్‌కు తను చేస్తున్న పనిలోనే ఉండిపోవడం అలవాటైంది. కష్టాలు చెప్పుకోడానికి మాటలు అవసరం. కష్టాలను తీర్చడానికి మాటలు అవసరం లేదు. ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా ఉన్నప్పుడు గంభీర్‌ను అతిషీ సవాల్ చేశారు. ‘‘నాతో డిబేట్‌కి వస్తావా?’’ అన్నారు. ఆమె ఛాలెంజ్‌ని గంభీర్ తిరస్కరించాడు. ‘‘ధర్నాల మీద, డిబేట్ల మీద నాకు నమ్మకం లేదు’’ అన్నాడు! అమ్మానాన్న దగ్గర పెరిగిన పిల్లల కన్నా.. వాళ్ల అమ్మానాన్నల దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కువ జీవితాన్ని చూస్తారు. నెమ్మదిని అలవరచుకుంటారు. గంభీర్ అలాగే పెరిగాడు. గంభీర్ పుట్టింది, క్రికెట్లో రాణించింది, రాజకీయాల్లోకి వచ్చిందీ అంతా ఢిల్లీలోనే. ఇప్పుడు అదే ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జీబీ రోడ్డు ఏరియా సెక్స్ వర్కర్ల పిల్లల్లోని 25 మంది విద్యార్థినులలో ఈ ఏడాది 10 మందిని, వచ్చే విద్యా సంవత్సరం 15 మందిని తన ‘పంఖ్’ సంరక్షణలోకి ‘దత్తత’ తీసుకోబోతున్నాడు. వాళ్ల ఫీజులు తనే కడతాడు. వాళ్ల ఆరోగ్య అవసరాలను తనే చూసుకుంటాడు. వాళ్ల యూనిఫామ్‌లు, వాళ్లకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ తనే ఏర్పాటు చేస్తాడు. అమ్మమ్మ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు గంభీర్. పంఖ్ కార్యక్రమాన్నీ ఆమెకే అంకితం ఇచ్చాడు. ఇప్పటికే అతడు సైన్యంలో అమరవీరులైన వారి పిల్లలు 200 మందికి చేయూతను ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడం కోసమే అతడు ఆరేళ్ల క్రితం ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ను నెలకొల్పాడు. ‘‘ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. వారికి విస్తృతంగా చదువు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. అందుకోసం ఏ కాస్త స్థోమత ఉన్నవారైనా ముందుకు రావాలి’’ అంటాడు గంభీర్. అమ్మమ్మ అతడిని అలా పెంచింది. -
నోట్ల రద్దుతో సెక్స్ వర్కర్లకూ పనిలేదు!
న్యూ ఢిల్లీ: నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా బిజినెస్‌లు చతికిలపడ్డాయి. ఢిల్లీ జీబీ రోడ్ రెడ్‌లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు సైతం నోట్ల రద్దుతో తమకు ఏమాత్రం గిరాకీ లేదని తలలు పట్టుకుంటున్నారు. ఈ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే.. తాము ఇప్పటివరకూ కూడబెట్టుకున్న కొద్దోగొప్పో డబ్బుకూడా ఖర్చయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్న సుమారు 5000 మంది సెక్స్ వర్కర్లు పని లేక ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన రేఖ అనే ఓ సెక్స్ వర్కర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి 80 శాతం మందికి పనిలేదని.. చాలా మంది తమ సొంత ఊళ్లకు పయనమయ్యారని వెల్లడించింది. చేతిలో డబ్బులేకపోవడంతో కస్టమర్లు అటువైపు రావడం లేదని తెలిపింది. దీంతో తమ చార్జీలు సైతం 50 శాతం మేర తగ్గించుకున్నట్లు తెలిపింది. తమ డ్యాన్సులతో అలరించే సెక్స్ వర్కర్లపై సైతం కస్టమర్లు పాత 500, 1000 నోట్లను విసురుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని వాపోయింది. -
సెక్స్ వర్కర్లకు కొత్త అడ్రస్
న్యూఢిల్లీ: కాస్త ఆలస్యమైనా.... ఎట్టకేలకు ఓ మంచి జరుగుతోంది. దాదాపు 48 ఏళ్ల తరువాత జీబీ రోడ్డులోని సెక్స్ వర్కర్ల చిరుమానా మారబోతోంది. సెక్స్ వర్కర్ల ఓటరు గుర్తింపు కార్డుపై ‘జీబీ రోడ్డు’ చిరుమానా వారి గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, వారిని అవమానాలకు, నిర్లక్ష్యానికి గురిచేసింది. దీంతో వారి చిరునామాను స్వామీ శ్రద్ధానంద మార్గ్‌గా మార్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రాంతానికి 1966లో ఇచ్చిన అధికారిక పేరు స్వామీ శ్రద్ధానంద మార్గ్. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరించి నప్పుడు చాలా కొద్ది మంది సెక్స్ వర్కర్లు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ 77 వ్యభిచార గృహాలు ఉండగా, వాటిలో సుమారు 5,500 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. కాగా వీరిలో 1,500 మంది కి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. జీబీ రోడ్డు - గార్స్టిన్ బాస్టియన్ రోడ్డుకు ఓ శాశ్వతమైన కళంకం ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి పేరును ఈ రోడ్డుకు పెట్టారు. ఇక్కడ వ్యభిచార గృహాలు మాత్ర మే కాకుండా వాహనాల విడిభాగాలు, ఇతర యంత్ర పరికరాలు విక్రయించే మార్కెట్ ఉంది. జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతంలోనే ఇది అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచింది. రెండు, మూడో అంతస్తులోని వ్యభిచార గృహాలు సూర్యాస్తమయం అయి న తరువాత పని ప్రారంభిస్తాయి. ‘‘జీబీ రోడ్డు పేరుతోనే ఓ ప్రతికూలత ఉంది. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన ఇక్కడి సెక్స్ వర్కర్లు బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేకపోతున్నారు. వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతర ప్రభుత్వ పత్రాలు లభించడం లేదు. అందువల్లనే ఇతర సెక్స్‌వర్కర్లు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది’’ అని ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ చెప్పారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఓటరు నమోదు పత్రాలను పంపిణీ చేస్తామని అన్నారు. జీబీ రోడ్డు అడ్రస్‌తో ఓటరు గుర్తింపు కార్డులున్న సెక్స్ వర్కర్లకు కూడా ఈ పత్రాలను జారీ చేస్తామని చెప్పారు. అడ్రస్ మార్పు వల్ల వారి కి గౌరవం లభించవచ్చని, ఇతరులు కూడా తమ హక్కులను ఉపయోగించుకునేందుకు ముం దుకు రావచ్చని విజయ్‌దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వీరినెవరూ పట్టిం చుకోలేదని, తాము సమస్యను విశ్లేషించామని, అణగారిన వర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని దేవ్ పేర్కొన్నారు. జీబీ రోడ్డులోని ఇతరుల గుర్తింపు కార్డులపై సవివరమైన చిరునామా ఉంటుందని, కానీ సెక్స్ వర్కర్లకు మాత్రం కేవలం ‘జీబీ రోడ్డు’ అని మాత్రమే ముద్రించి ఉందని చెప్పారు. దీంతో వారు ఇతర పౌరుల నుంచి వేరుపడిపోయారని చెప్పారు. ఈ వేర్పాటు వారి పట్ల బహిరంగ ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తోందని, అవమానాలకు, వేధింపులకు కారణమవుతోందని అన్నారు. ‘‘రైలులో ఓ టికెట్ తనిఖీ అధికారి తనతో లైంగిక సంపర్కం పెట్టుకోవాలని లేదా రిజర్వేషన్ టికెట్ ఉన్నప్పటికీ రైలు నుంచి దించేస్తానని బెది రించాడు. నా గుర్తింపుకు రుజువుగా చూపించిన ఓటర్ ఐడెంటిటీ కార్డుపై జీబీ రోడ్డు అని రాసి ఉండడమే అందుకు కారణం’’ అని ఓ సెక్స్ వర్కర్ తెలిపింది. ‘‘మా ఓటరు ఐడీపై అడ్రస్‌ను చూసిన ఓ పాఠశాల యాజమాన్యం నా నాలుగేళ్ల కుమారుడిని చేర్చుకొనేందుకు నిరాకరించింది’’ అని మరొకరు వాపోయారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తమ చిరునామాను స్వామీ శ్రద్ధానంద మార్గ్ మార్చనుండడంతో తమజీవితాల్లో మార్పు రాగలదని సెక్స్ వర్కర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.