గోడలు అడ్డు తప్పుకోవు. దూకేసి వెళ్లాలి. లేదంటే.. పడగొట్టుకుని వెళ్లాలి. రెడ్ లైట్ ఏరియాలో రెండూ కష్టమే. అక్కడ నీడలు కూడా గోడలే. తల్లులు గోడలు.. కూతుళ్లు నీడలు! ఆ నీడలకు.. రెక్కలు కడుతున్నాడు గంభీర్. చదువుల రెక్కలవి.
ఎన్నికల సమయం. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రాజకీయ అనుభవం లేదు. అనుభవం అవసరం అని కూడా అతడు అనుకోలేదు. ఏప్రిల్ నుంచి ఎన్నికలైతే, మార్చిలో రాజకీయాల్లోకి వచ్చాడు. అతడి మీద పోటీలో ఉన్నది అతిషీ సింగ్. అతడి వయసే. రాజకీయ అనుభవంలో మాత్రం సీనియర్. ‘ఆప్’ పార్టీ అభ్యర్థి. ఆ సీనియర్‌ని ఓడించాడు గంభీర్. 4 లక్షల 77 వేల ఓట్ల తేడాతో ఓడించాడు! రూలింగ్ పార్టీ అభ్యర్థి అనీ, మాజీ క్రికెటర్ అనీ అంత మార్జిన్ రాలేదు. అతడు ఎన్నికల్లో నిలబడక ముందు నుంచే, పద్మశ్రీ అవార్డు రాకముందే, అసలు క్రికెట్ నుంచి రిటైర్ అవడానికి నాలుగేళ్ల ముందు నుంచే గంభీర్ జనానికి తెలుసు.
జనం అంటే.. నిద్రతో పస్తుల కడుపును నింపుకుంటున్నవారు. మిలటరీలో పని చేస్తున్న ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పిల్లలు. గూడు లేని అభాగ్యులైన ఆడపిల్లలు. వాళ్లకు అన్నం పెట్టాడు. చదువు చెప్పించాడు. వాళ్ల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. ఉపాధి కల్పించాడు. ఢిల్లీ నగరానికి కూడా కొంత చేశాడు. పచ్చటి మొక్కల్ని నాటించి కాలుష్యాన్ని తగ్గించే పనిని గడ్డిమోపులా తలమీదకు ఎత్తుకున్నాడు! ఇప్పుడు ఢిల్లీలోని సెక్స్ వర్కర్‌ల పిల్లల సంరక్షణను భుజాన వేసుకున్నాడు. ఆ బాధ్యతకు అతడు పెట్టుకున్న పేరు ‘పంఖ్’. అంటే రెక్కలు. అయిష్టమైన బతుకుల నుంచి ఆడపిల్లలకు వారు కోరుకున్న కెరీర్‌లో ఎదిగేలా, ఎగిరేలా రెక్కల్ని తొడగడమే ‘పంఖ్’.
గంభీర్ ఎప్పుడూ మాట్లాడుతూ కనిపించడు. ఆలోచనల్లో ఉండేవాళ్లు మౌనం దాల్చడం సహజమే. క్రికెట్‌లోనూ అంతే, ఇప్పుడు రాజకీయాల్లోనూ అంతే. చేయడమే అతడు మాట్లాడ్డం. ‘‘ఎందుకలా ఉంటారు మీరు?’’ అని ఓ ఇంటర్వూ్యలో గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘పనిలో ఉన్నప్పుడు మాట్లాడను’’ అన్నాడు. పదో యేట క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుంచే గంభీర్‌కు తను చేస్తున్న పనిలోనే ఉండిపోవడం అలవాటైంది. కష్టాలు చెప్పుకోడానికి మాటలు అవసరం. కష్టాలను తీర్చడానికి మాటలు అవసరం లేదు. ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా ఉన్నప్పుడు గంభీర్‌ను అతిషీ సవాల్ చేశారు. ‘‘నాతో డిబేట్‌కి వస్తావా?’’ అన్నారు. ఆమె ఛాలెంజ్‌ని గంభీర్ తిరస్కరించాడు. ‘‘ధర్నాల మీద, డిబేట్‌ల మీద నాకు నమ్మకం లేదు’’ అన్నాడు! అమ్మానాన్న దగ్గర పెరిగిన పిల్లల కన్నా.. వాళ్ల అమ్మానాన్నల దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కువ జీవితాన్ని చూస్తారు. నెమ్మదిని అలవరచుకుంటారు. గంభీర్ అలాగే పెరిగాడు.
గంభీర్ పుట్టింది, క్రికెట్‌లో రాణించింది, రాజకీయాల్లోకి వచ్చిందీ అంతా ఢిల్లీలోనే. ఇప్పుడు అదే ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జీబీ రోడ్డు ఏరియా సెక్స్ వర్కర్‌ల పిల్లల్లోని 25 మంది విద్యార్థినులలో ఈ ఏడాది 10 మందిని, వచ్చే విద్యా సంవత్సరం 15 మందిని తన ‘పంఖ్’ సంరక్షణలోకి ‘దత్తత’ తీసుకోబోతున్నాడు. వాళ్ల ఫీజులు తనే కడతాడు. వాళ్ల ఆరోగ్య అవసరాలను తనే చూసుకుంటాడు. వాళ్ల యూనిఫామ్‌లు, వాళ్లకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులు అన్నీ తనే ఏర్పాటు చేస్తాడు. అమ్మమ్మ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు గంభీర్. పంఖ్ కార్యక్రమాన్నీ ఆమెకే అంకితం ఇచ్చాడు. ఇప్పటికే అతడు సైన్యంలో అమరవీరులైన వారి పిల్లలు 200 మందికి చేయూతను ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడం కోసమే అతడు ఆరేళ్ల క్రితం ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ను నెలకొల్పాడు. ‘‘ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. వారికి విస్తృతంగా చదువు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. అందుకోసం ఏ కాస్త స్థోమత ఉన్నవారైనా ముందుకు రావాలి’’ అంటాడు గంభీర్. అమ్మమ్మ అతడిని అలా పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment