సెక్స్ వర్కర్లకు కొత్త అడ్రస్ | Delhi's GB Road sex workers to finally get new address | Sakshi
Sakshi News home page

సెక్స్ వర్కర్లకు కొత్త అడ్రస్

Published Sat, Jul 5 2014 8:16 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సెక్స్ వర్కర్లకు కొత్త అడ్రస్ - Sakshi

సెక్స్ వర్కర్లకు కొత్త అడ్రస్

న్యూఢిల్లీ: కాస్త ఆలస్యమైనా.... ఎట్టకేలకు ఓ మంచి జరుగుతోంది. దాదాపు 48 ఏళ్ల తరువాత జీబీ రోడ్డులోని సెక్స్ వర్కర్ల చిరుమానా మారబోతోంది. సెక్స్ వర్కర్ల ఓటరు గుర్తింపు కార్డుపై ‘జీబీ రోడ్డు’ చిరుమానా వారి గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, వారిని అవమానాలకు, నిర్లక్ష్యానికి గురిచేసింది. దీంతో వారి చిరునామాను స్వామీ శ్రద్ధానంద మార్గ్‌గా మార్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రాంతానికి 1966లో ఇచ్చిన అధికారిక పేరు స్వామీ శ్రద్ధానంద మార్గ్.

గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరించి నప్పుడు చాలా కొద్ది మంది సెక్స్ వర్కర్లు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ 77  వ్యభిచార గృహాలు ఉండగా, వాటిలో సుమారు 5,500 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. కాగా వీరిలో 1,500 మంది కి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులున్నాయి.

జీబీ రోడ్డు - గార్‌స్టిన్ బాస్టియన్ రోడ్డుకు ఓ శాశ్వతమైన కళంకం ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి పేరును ఈ రోడ్డుకు పెట్టారు. ఇక్కడ వ్యభిచార గృహాలు మాత్ర మే కాకుండా వాహనాల విడిభాగాలు, ఇతర యంత్ర పరికరాలు విక్రయించే మార్కెట్ ఉంది. జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతంలోనే ఇది అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచింది. రెండు, మూడో అంతస్తులోని వ్యభిచార గృహాలు సూర్యాస్తమయం అయి న తరువాత పని ప్రారంభిస్తాయి.

 ‘‘జీబీ రోడ్డు పేరుతోనే ఓ ప్రతికూలత ఉంది.
ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన ఇక్కడి సెక్స్ వర్కర్లు బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేకపోతున్నారు. వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతర ప్రభుత్వ పత్రాలు లభించడం లేదు. అందువల్లనే ఇతర సెక్స్‌వర్కర్లు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది’’ అని ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ చెప్పారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఓటరు నమోదు పత్రాలను పంపిణీ చేస్తామని అన్నారు. జీబీ రోడ్డు అడ్రస్‌తో ఓటరు గుర్తింపు కార్డులున్న సెక్స్ వర్కర్లకు కూడా ఈ పత్రాలను జారీ చేస్తామని చెప్పారు.

అడ్రస్ మార్పు వల్ల వారి కి గౌరవం లభించవచ్చని, ఇతరులు కూడా తమ హక్కులను ఉపయోగించుకునేందుకు ముం దుకు రావచ్చని విజయ్‌దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వీరినెవరూ పట్టిం చుకోలేదని, తాము సమస్యను విశ్లేషించామని, అణగారిన వర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని దేవ్ పేర్కొన్నారు. జీబీ రోడ్డులోని ఇతరుల గుర్తింపు కార్డులపై సవివరమైన చిరునామా ఉంటుందని, కానీ సెక్స్ వర్కర్లకు మాత్రం కేవలం ‘జీబీ రోడ్డు’ అని మాత్రమే ముద్రించి ఉందని చెప్పారు. దీంతో వారు ఇతర పౌరుల నుంచి వేరుపడిపోయారని చెప్పారు. ఈ వేర్పాటు వారి పట్ల బహిరంగ ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తోందని, అవమానాలకు, వేధింపులకు కారణమవుతోందని అన్నారు.
 
‘‘రైలులో ఓ టికెట్ తనిఖీ అధికారి తనతో లైంగిక సంపర్కం పెట్టుకోవాలని లేదా రిజర్వేషన్ టికెట్ ఉన్నప్పటికీ రైలు నుంచి దించేస్తానని బెది రించాడు. నా గుర్తింపుకు రుజువుగా చూపించిన ఓటర్ ఐడెంటిటీ కార్డుపై జీబీ రోడ్డు అని రాసి ఉండడమే అందుకు కారణం’’ అని ఓ సెక్స్ వర్కర్ తెలిపింది.

 ‘‘మా ఓటరు ఐడీపై అడ్రస్‌ను చూసిన ఓ పాఠశాల యాజమాన్యం నా నాలుగేళ్ల కుమారుడిని చేర్చుకొనేందుకు నిరాకరించింది’’ అని మరొకరు వాపోయారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తమ చిరునామాను స్వామీ శ్రద్ధానంద మార్గ్ మార్చనుండడంతో తమజీవితాల్లో మార్పు రాగలదని సెక్స్ వర్కర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement