పచ్చని పైరును ఆంబోతులు మేయడానికొస్తే
చేనేం చేయగలుగుతుంది?!
డొక్కలెండిన కాపు ఏం చేయగలుగుతాడు?
ఆ ఊళ్లో ఓ పచ్చని కుటుంబం.
ఓ తల్లి, ఇద్దరు ఆడపిల్లలు.
ఆ కుటుంబంపై ఊళ్లోని ఆంబోతులు కన్నేశాయి.
ఇంటి మీద పడ్డాయి. ఒంటి మీద పడ్డాయి.
తర్వాత ఏం జరిగింది?
ఆ తల్లి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది?
భర్త బాధ్యత లేకుండా వదిలేసి వెళితే..
బరువు భుజాలపై వేసుకుని
జీవితాన్ని లాక్కొచ్చిన ఓ భార్య కథ ఇది.
పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చి తలుపులు బిడాయించింది నా చిన్నకూతురు. కనుకొలకుల్లో నీరు. కోపంతో ఎర్రబారిన ముఖం. ఆ పోకిరీలు ఇవాళ కూడా వేధించారన్నమాట. ఇంటి దాకా వెంటాడారన్నమాట. బయటకెళ్లి వాళ్లతో తలపడదామని తలుపులు తీయబోయాను. నా కూతురు వారించింది. నేను వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమోనని దాని భయం. అనేక గాయాలతో బాధపడుతున్న నన్ను ఇంకాస్త గాయపడకుండా చూడాలనేది దాని తపన. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నా మనసంతా గాయాలే. నేనే ఒక నడిచే గాయాన్ని. లోతైన ఈ గాయాల గురించి ఎవరికైనా అర్థం చేయించాలంటే నా వైవాహిక జీవితం గురించి మాట్లాడాల్సిందే.
నా భర్త బాధ్యత లేని మనిషి. బిడ్డల భారాన్ని నామీద వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో కొన్ని ఆంబోతులు నా మీద కన్నేశాయి. నన్ను లొంగదీసుకునే ప్రయత్నాలు చేశాయి. వాళ్లను ఖాతరు చేయనందుకు ఆగ్రహించాయి. పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తితో నాకు స్నేహం కుదిరింది. పిల్లల అంగీకారంతో మేం దంపతులమయ్యాం. నాకు గుండె జబ్బు చేస్తే ఆయనే ఆపరేషన్ చేయించారు. నా పెద్ద కూతురికి పెళ్లి చేసింది కూడా ఆయనే. ఊళ్లో నా మీద కన్నేసిన వాళ్లు దీన్ని తట్టుకోలేకపోయారు. నన్ను ఓ ఉంపుడుగత్తెగా ప్రచారం చేసి నా కుటుంబాన్ని చులకనగా చూశారు. మేం భార్యాభర్తలమన్నా వినిపించుకోలేదు. నన్ను లొంగిపొమ్మని వేధించారు. వాళ్లను కాదన్నందుకు కక్ష గట్టారు. నా భర్తపై దాడి చేశారు. ఆ దృశ్యాల్ని వీడియో తీసి వాట్సాప్‌ల ద్వారా ప్రచారంలో పెట్టారు. అది పోలీసులకు చేరింది. వారు ఆ వీడియో ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. మా స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
నేను లొంగక పోవడంతో నా చెల్లెల్నీ, నా ఇద్దరి కూతుళ్లనీ వేధించడం మొదలుపెట్టారు వాళ్లు. వారం రోజులపాటు అసభ్యమైన కామెంట్లతో హింసపెట్టారు. వీధిలోని యువకుల్ని మా అమ్మాయిలపైకి ఉసిగొల్పారు. వాళ్లు ఉద్యోగాలు చేసే చోట చెడు ప్రచారం చేశారు. వాళ్లని ఉద్యోగాల్లోంచి తీసేయించే ప్రయత్నాలు చేశారు. పోలీసులకి స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు మాపై కక్షగట్టారు.మా ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాళ్లని వెనకేసుకొచ్చాడు. అతని అండ చూసుకుని మా వీధి యువకులు రెచ్చిపోయారు. ఓ రోజు ఆరుగురు అబ్బాయిలు ముఖాలకు ముసుగులు వేసుకుని మా ఇంట్లోకి వచ్చారు. నన్నూ మా అమ్మనీ చంపేస్తామని బెదిరించారు. నా చెల్లీ కూతుళ్లపై లైంగిక దాడికి ప్రయత్నించారు. వారి అంగాంగాల్ని తాకుతూ హింసించారు. గట్టిగా ప్రతిఘటించి తమను తాము కాపాడుకున్నారు వాళ్లు.అవమానం తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. కాస్త ఆలోచించాక, మా ఆలోచన సరి కాదనిపించింది నాకు.∙ధైర్యం చేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లాను. మాకు జరిగిన అవమానాల్నీ అన్యాయాల్నీ పూసగుచ్చినట్టు వాళ్లకి వివరించాను. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నా భర్తను కొట్టినందుకు, నా చెల్లీ కూతుళ్లపై లైంగిక దాడులకు ప్రయత్నించినందుకు మొత్తం 18 మందిపై ‘నిర్భయ’ ‘పోక్సో’ కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. పోలీసుల్ని ఆశ్రయించాక వాళ్లు మా జోలికి రావట్లేదు. ఇప్పటికైతే కొంత రక్షణ లభించింది మాకు.
ఎల్‌సీసీలు ఏవీ?
ప్రతి స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. ఇష్టం లేని వాణ్ణి తిరస్కరించే హక్కూ ఉంది. మొత్తంగా తమ జీవితాల్ని తాము నిర్దేశించుకునే హక్కులున్నాయి స్త్రీలకి. వాళ్ల మీద పెత్తనం చేయబూనుకోవడం ఎంతైనా దారుణం. లలిత కేసులో మాదిరిగా స్త్రీలపై పోలీసింగ్ చేయడానికి, ఆమె సెక్సువాలిటీని కంట్రోల్ చేయడానికి తనకు అధికారం ఉందని ఈ పురుష సమాజం భావిస్తోంది. ఆమెను వెంటాడి వేధించే అధికారం తనకుందని అనుకుంటోంది. స్త్రీలను చెప్పుచేతుల్లోకి తీసుకోవడానికి.. కుదరకపోతే ఆమెపై పెత్తనం చేయడానికి.. అది కూడా సాధ్యం కాకపోతే దుష్ప్రచారం చేయడానికి.. అంతిమంగా దాడికి సైతం దిగేందుకు తెగిస్తోంది. ఇలాంటి పితృస్వామ్య ధోరణుల్ని అడ్డుకోవడానికి, వీటిపై సమాజాన్ని సెన్సిటైజ్ చేయడానికి మహిళా ఉద్యమాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టం లాంటివి వచ్చాయి. కానీ వాటి అమలు గురించి ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. చాలా కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు కావడం లేదు. స్థానిక ఫిర్యాదుల కమిటీల (ఎల్‌సీసీ) ఊసే లేదు. లలిత లాంటి బాధిత మహిళలకు సాయపడేందుకు స్థానిక ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు కావాల్సివుంది. ఆమె విషయంలో పోలీసులు బాధ్యతగా స్పందించడం, చట్టాల్ని అమలు చేయడానికి ప్రయత్నించడం బాగుంది. ప్రతిచోటా ఇలాంటి సానుకూల వాతావరణం చోటు చేసుకోవాలి.
– ఎమ్. లక్ష్మి, ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ
(లలిత కేస్ స్టడీ)
– పరసా సుబ్బారావు, ‘సాక్షి’ అమలాపురం టౌన్
Comments
Please login to add a commentAdd a comment