బిస్కెట్ అనుకొని జిలెటిన్ స్టిక్ తిని..
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి జిల్లా అలగారై గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు విష్ణుదేవ్ చేపలు పట్టడానికి ఉపయోగించే జిలెటిన్ స్టిక్(పేలుడు పదార్థం)ను బిస్కెట్ అనుకొని తినడంతో ఒక్కసారిగా ఆ స్టిక్ పేలిపోయింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బాలుడి తండ్రి, సోదరుడు చేపలు పడుతూ జీవనం సాగిస్తారు. అయితే విష్ణు సోదరుడు గంగతరానా, అతని స్నేహితులు మోహన్ రాజ్, తమిళ సరన్‌లు చేపల పట్టడానికి మూడు జిలెటిన్ స్టిక్‌లను మంగళవారం తీసుకొచ్చారు.
కాగా వారు తెచ్చిన మూడు జిలెటిన్ స్టిక్‌లను చేపలు పట్టడానికి తీసుకెళ్లగా.. మిగిలిన ఒక స్టిక్‌ను ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న విష్ణుదేవ్ జిలెటిన్ స్టిక్‌ను బిస్కెట్ అని పొరపాటున తినడానికి నోట్లో పెట్టగానే అది పేలిపోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన విచారణలో భాగంగా విష్ణు సోదరుడు గంగతరానా, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.