అత్యవసరం.. నిరుపయోగం!
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాలిటిలో ప్రతి ఏడాది నీటిఎద్దడి సర్వసాధారణంగా మారింది. పట్టణంలోని 36 వార్డుల్లోనూ ప్రజలు నీటికష్టాలు పడుతూనే ఉన్నారు. ముందస్తుగా పాలకులు చర్యలు తీసుకోవడంలో ప్రతి ఏడాది విఫలమవుతూనే ఉన్నారు.
రెండేళ్లుగా మూలకే
విద్యుత్ లేని సమయంలో నీటిసరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో కిల్లోస్కర్ కంపెనీ జనరేటర్‌ను కొనుగోలు చేశారు. అప్పటినుంచి దానిని ఉపయోగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. సాంకేతిక సమస్యతో జనరేటర్‌ను వినియోగించడం లేదని చెబుతున్నప్పటికీ పంప్‌హౌస్‌లో వినియోగించే బోర్లు పాతవి కావడంతో సరిపడా సామర్థ్యం లేక మూలనపడినట్లు చెబుతున్నారు. జనరేటర్ వినియోగించక పోవడంతో కాలనీల్లో గత ఏడాది సైతం నీటి కష్టాలు తప్పలేదు. దీనికి తోడు ఈ జనరేటర్లో 100 లీటర్లకు పైగా డీజిల్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డీజిల్ ఉందా లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తబోర్లతో సమస్యతీరేనా?
గతంలో బోర్లు పాతవిగా ఉండటంతో జనరేటర్ స్టార్ట్ చేసేందుకు బోర్ల సామర్థ్యం లేకపోవడంతో ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం బల్దియాలో 13వ ఆర్థిక నిధుల నుంచి రూ.92 లక్షలతో 125 హెచ్‌పీల సామర్థ్యం గల 3 బోర్లను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్‌ను పూర్తిస్థాయిలో స్టార్ట్ చేసెందుకు సామర్థ్యం సరిపోతుందని సమాచారం. దీంతో జనరేటర్‌ను సైతం వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాదైన రోజువారిగా నీరందేనా?
మున్సిపాలిటిలోని 36 వార్డుల్లో లక్ష 75 వేల వరకు జనాభా ఉన్నారు. 12,600లకు పైగా నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సుమారు 8 వేలకు పైగా మురికివాడల్లోనే ఉంటాయి. నీటికోసం ప్రతిరోజు ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితులున్నాయి. గత పదేళ్ల కిందట నీటి సరఫరా చేసినట్లుగానే ఈ ఏడాది నీటి సరఫరా ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నీటిఎద్దటి లేకుండా చర్యలు
విద్యుత్ లేని సమయంలో నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో సాంకేతిక పరమైన కారణాలతో జనరేటర్ పనిచేయలేదు. కొత్తమోటర్లు కొనుగోలు చేసి బిగించాం. త్వరలో కిర్లోస్కర్ కంపెనీవాళ్లను పిలిపించి జనరేటర్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఏడాది ఉపయోగంలోకి వస్తుంది.
– నవీన్‌కుమార్, మున్సిపల్ ఏఈ
నిరుపయోగంగా ఉన్న జనరేటర్