Genco employees
-
పోలీసులపై దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి
-
పోలీసులపై దూసుకెళ్లిన లారీ
ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు నాగార్జునసాగర్: రోడ్డుపై బోల్తాపడిన ట్రాక్టర్ని తొలగిస్తున్న పోలీసులు, జెన్కో ఉద్యోగులపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ప్రమా దం చోటు చేసుకుంది. సాగర్ దయ్యాలగండి రోడ్డుపై ఓ గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు బోల్తా పడిన ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగిస్తుండగా, నాగార్జునసాగర్ హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్, జెన్కో ఉద్యోగులను, వారి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బాలు నాయక్ (25), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19), పెద్దవూర మండలం నెల్లికల్లుకు చెందిన చంద్రయ్య(45)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఎడమకాలువపై ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో పనిచేస్తున్న ఏఈ క్రాంతిభూషణ్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. -
రాష్ట్రమంతా బ్లాక్ డే!!
రాష్ట్రంలోనే కాదు.. దక్షిణాది మొత్తం కనీ వినీ ఎరుగని విద్యుత్తు సంక్షోభం నెలకొంది. ఇంతకాలం సమైక్య రాష్ట్రం కోసం శాంతియుతంగా సమ్మె చేసిన విద్యుత్తు ఉద్యోగులు.. తెలంగాణ ప్రకటనతో ఒక్కసారిగా తమ ఆందోళనను ఉధృతం చేశారు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని ఉద్యోగులు నిలిపివేశారు. అక్కడి 2, 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేయడంతో దాదాపు 400 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో కూడా ఉద్యోగులు ఉత్పత్తి నిలిపివేయడంతో మరో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. డొంకరాయి పవర్‌ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో ఖమ్మం జిల్లా పొల్లూరు పవర్ ప్లాంట్‌కు అంతరాయం కలిగింది. నీటి సరఫరా లేక అక్కడ 450 మెగావాట్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాని ఫలితంగా ఇప్పటికే సీమాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. శుక్రవారం నాడు విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోగా.. దానికి మరమ్మతులు చేసేందుకు ఉద్యోగులు ముందుకు రాలేదు. దాంతో దాదాపు 1265 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో యూనిట్ ప్రస్తుతానికి ఆయిల్ మీద నడుస్తోంది. ఇది ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే జరిగితే గ్రిడ్ వైఫల్యం తప్పదని జెన్ కో సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. గ్రిడ్ విఫలమైతే రైల్వేలతో సహా రాష్ట్రంలో అన్ని రంగాలకూ విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుందని, రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని విజయవాడ ఎన్టీటీపీఎస్ లోని సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. గ్రిడ్ ను మళ్లీ పునరుద్ధరించాలన్నా కూడా సమయం చాలానే పడుతుందన్నారు. ఇప్పటివరకు జెన్ కో చరిత్రలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయడం ఎప్పుడూ లేదు. ఇదే ప్రథమం. ఇన్నాళ్లపాటు కేవలం శాంతియుత సమ్మెకు మాత్రమే పరిమితమైన విద్యుత్తు ఉద్యోగులు.. కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలియజేయడంతో భగ్గుమన్నారు. ఇక నుంచి తమ ఆందోళనను తీవ్రరూపం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇన్నాళ్లుగా రంగంలోకి దిగని జెన్కో ఉద్యోగులు కూడా ఇప్పుడు రంగ ప్రవేశం చేశారు. అందువల్లే విద్యుత్ ఉత్పత్తి ప్రభావితం అవుతోంది. సాధారణంగా విద్యుత్తును ఉత్పత్తిచేసే యూనిట్లు ఒక్కసారి షట్ డౌన్ అయ్యాయంటే అవి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి ఎంత లేదన్నా కనీసం 5-6 గంటలు పడుతుంది. అప్పటినుంచి 24 గంటల తర్వాత మాత్రమే ఉత్పత్తి పూర్తిస్థాయిలో బయటకు వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు రాష్ట్రమంతా శనివారం నాడు అంధకారం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎన్టీటీపీపీఎస్, సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, కడపలోని ఆర్టీపీపీ, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్కో ఉద్యోగుల ఆందోళన కొనసాగితే.. రాష్ట్రంలో మరిన్ని 'బ్లాక్‌డే'లు చూడాల్సి వస్తుంది!!