రాష్ట్రమంతా బ్లాక్ డే!! | Genco employees stall power production | Sakshi
Sakshi News home page

రాష్ట్రమంతా బ్లాక్ డే!!

Published Sat, Oct 5 2013 2:10 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

రాష్ట్రమంతా బ్లాక్ డే!! - Sakshi

రాష్ట్రమంతా బ్లాక్ డే!!

రాష్ట్రంలోనే కాదు.. దక్షిణాది మొత్తం కనీ వినీ ఎరుగని విద్యుత్తు సంక్షోభం నెలకొంది. ఇంతకాలం సమైక్య రాష్ట్రం కోసం శాంతియుతంగా సమ్మె చేసిన విద్యుత్తు ఉద్యోగులు.. తెలంగాణ ప్రకటనతో ఒక్కసారిగా తమ ఆందోళనను ఉధృతం చేశారు.

సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని ఉద్యోగులు నిలిపివేశారు. అక్కడి 2, 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేయడంతో దాదాపు 400 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో కూడా ఉద్యోగులు ఉత్పత్తి నిలిపివేయడంతో మరో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. డొంకరాయి పవర్‌ప్లాంట్‌ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో ఖమ్మం జిల్లా పొల్లూరు పవర్‌ ప్లాంట్‌కు అంతరాయం కలిగింది. నీటి సరఫరా లేక అక్కడ 450 మెగావాట్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాని ఫలితంగా ఇప్పటికే సీమాంధ్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. శుక్రవారం నాడు విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోగా.. దానికి మరమ్మతులు చేసేందుకు ఉద్యోగులు ముందుకు రాలేదు. దాంతో దాదాపు 1265 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడో యూనిట్ ప్రస్తుతానికి ఆయిల్ మీద నడుస్తోంది. ఇది ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే జరిగితే గ్రిడ్ వైఫల్యం తప్పదని జెన్ కో సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు.

గ్రిడ్ విఫలమైతే రైల్వేలతో సహా రాష్ట్రంలో అన్ని రంగాలకూ విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుందని, రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని విజయవాడ ఎన్టీటీపీఎస్ లోని సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. గ్రిడ్ ను మళ్లీ పునరుద్ధరించాలన్నా కూడా సమయం చాలానే పడుతుందన్నారు. ఇప్పటివరకు జెన్ కో చరిత్రలో ఉద్యోగులు స్వచ్ఛందంగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయడం ఎప్పుడూ లేదు. ఇదే ప్రథమం.

ఇన్నాళ్లపాటు కేవలం శాంతియుత సమ్మెకు మాత్రమే పరిమితమైన విద్యుత్తు ఉద్యోగులు.. కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలియజేయడంతో భగ్గుమన్నారు. ఇక నుంచి తమ ఆందోళనను తీవ్రరూపం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇన్నాళ్లుగా రంగంలోకి దిగని జెన్కో ఉద్యోగులు కూడా ఇప్పుడు రంగ ప్రవేశం చేశారు. అందువల్లే విద్యుత్ ఉత్పత్తి ప్రభావితం అవుతోంది.

సాధారణంగా విద్యుత్తును ఉత్పత్తిచేసే యూనిట్లు ఒక్కసారి షట్ డౌన్ అయ్యాయంటే అవి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి ఎంత లేదన్నా కనీసం 5-6 గంటలు పడుతుంది. అప్పటినుంచి 24 గంటల తర్వాత మాత్రమే ఉత్పత్తి పూర్తిస్థాయిలో బయటకు వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు రాష్ట్రమంతా శనివారం నాడు అంధకారం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎన్టీటీపీపీఎస్, సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, కడపలోని ఆర్టీపీపీ, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్కో ఉద్యోగుల ఆందోళన కొనసాగితే.. రాష్ట్రంలో మరిన్ని 'బ్లాక్డే'లు చూడాల్సి వస్తుంది!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement