సీమాంధ్రలో 85 శాతం కనెక్షన్లకు నిలిచిన సరఫరా
తాగునీటి పథకాలకూ కరెంట్ కట్
ఆస్పత్రుల్లో అంధకారం.. రోగుల యాతన
ఎన్‌టీటీపీఎస్‌కు ఇప్పటికే రూ. 31.3 కోట్ల నష్టం
సాక్షి, నెట్‌వర్క్: విద్యుత్ ఉద్యోగస్తులు నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి సరఫరా లేక జనం అల్లాడిపోయారు. అనేక పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడ ఆటోనగర్‌లో ఏకంగా 2,000 పరిశ్రమలు కరెంటు లేక నిలిచిపోయాయి. ఈపీడీసీఎల్ పరిధిలోని 6,980 మంది డిస్కం సిబ్బంది, సుమారు 1,400 మంది ట్రాన్స్‌కో సిబ్బంది సోమవారం ఉదయం నుంచి సమ్మెకు దిగడంతో సరఫరాలో తలెత్తే సాధారణ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించే దిక్కు లేక విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 9 గంటలకల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదారి జిల్లాల్లో చాలావరకు సరఫరా ఆగిపోయింది. ఈ జిల్లాల్లో 51.57 లక్షల కనెక్షన్లుండగా సోమవారం సాయంత్రానికి ఏకంగా 45 లక్షలు, అంటే 85 శాతానికి కరెంట్ కట్ అయింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులతో పాటు రైల్వే లైనుకు, కృష్ణపట్నం ఓడరేవుకు కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిపివేశారు.జేఏసీ ప్రతినిధులతో ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా అంతటా ఆదివారం రాత్రి 11.30 నుంచే సరఫరా ఆగిపోయింది. ఉదయం 4.30కు రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో పునరుద్ధరించినా ఉదయం ఆరింటికి ఆగిపోయింది. కాకినాడ, రాజమండ్రి సహా పలు ప్రభుత్వాస్పత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు అనేక అవస్థలు పడ్డారు. కాకినాడ, రాజమండ్రిల్లో సుమారు 10 పెట్రోల్ బంకులు కరెంటు లేక మూతపడ్డాయి. చిరు వ్యాపారులు కూడా దుకాణాలు మూసేయాల్సి వచ్చింది. చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల క్షేత్రానికి కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోరుుంది. అనంతపురం జిల్లా ధర్మవరం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, రాయదుర్గం తదితర ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు సరఫరా నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి.
మరోవైపు విద్యుత్ సమ్మె మూడో రోజుకు చేరినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. సమ్మె వల్ల కోట్లలో నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఒక్క విజయవాడ ఎన్‌టీటీపీఎస్‌పైనే జెన్‌కోకు ఇప్పటిదాకా రూ.31.3 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో అన్ని యూనియన్లు, కార్మిక సంఘాలు, ఇంజనీర్ అసోసియేషన్లు కలసికట్టుగా మెరుపు సమ్మెలోనే ఉన్నారు. విధుల్లో పాల్గొంటున్న కొద్దిమంది ఉద్యోగులనూ అడ్డుకుంటున్నారు. ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో దక్షిణాది గ్రిడ్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఇప్పటికిప్పుడు విధుల్లోకి వెళ్లినా అన్ని యూనిట్లలోనూ ఉత్పత్తి మొదలయేందుకు మూడు రోజులు పడుతుందని అధికారులంటున్నారు. కర్నూలు ఆర్‌టీపీపీలోని ఐదు యూనిట్లూ మూతబడే ఉన్నాయి. ప్లాంటు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా మూడు రోజుల పాటు యూనిట్లు నిలిచిపోయిన దాఖలాలు లేవు!