హైదరాబాద్ : సీమాంధ్రలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వటంతో దాని ప్రభావం పలు జిల్లాలపై పడింది. అనేక గ్రామాలు అంధకారం నెలకొంది. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లతో పాటు రాయలసీమలోని కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
విజయనగరం జిల్లాలో 128 గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాలో 200 గ్రామలు, తూర్పుగోదావరి జిల్లాలో 100 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 600 గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయి. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, ఫీడర్లు కుప్పకూలుతున్నాయి.
కాగా కడప 220 కేవీ పవర్ స్టేషన్‌లో బ్యాటరీలు పేలిపోవడంతో జిల్లా కేంద్రంతో పాటు రాజంపేట, బద్వేలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పునరుద్ధరణ పనులు నిలిచిపోవడంతో చీకట్లు తప్పడం లేదు. ప్రైవేట్ కార్మికులతో మరమ్మతులు చేయించేందుకు ఎస్‌ఈ ప్రయత్నించడంతో విద్యుత్ జేఏసీ వారిని అడ్డుకుంది.
ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే 72గంటల సమ్మెకు పిలుపునిచ్చామని, అయినా ప్రభుత్వం సమైక్యాంధ్ర ఉద్యమంపై స్పందించక పోవడం తగదని విద్యుత్ జేఏసీ నేతలు మండిపడ్డారు. 220కేవీ పవర్ స్టేషన్‌లో మరమ్మతులు చేయకపోతే మూడు నియోజకవర్గాల్లో చీకట్లు తప్పవని, తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవలసి ఉంటుందని ఉన్నతాధికారులు చెప్పినా విద్యుత్ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు.
అంధకారంలో మగ్గుతున్న పలు గ్రామాలు
Published Sat, Sep 14 2013 10:27 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement