విభజిస్తే... సీమాంధకారం | People observed voluntary power cut | Sakshi
Sakshi News home page

విభజిస్తే... సీమాంధకారం

Published Sun, Sep 1 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

People observed voluntary power cut

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 32వ రోజైన శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సమైక్య విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన స్విచ్‌ఆఫ్ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వచ్ఛందంగా లైట్లు ఆపివేశారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం నుంచి రిలే దీక్షలు ప్రారంభించారు. జిల్లా అధికారులంతా పాల్గొన్న దీక్షా శిబిరం వద్ద ఏజేసీ యు.సి.జి.నాగేశ్వరరావు డప్పు కొట్టి సమైక్యవాదానికి మద్దతు పలికారు.
 
విజయనగరంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్ద, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం సర్వ మతాలు సమానమేనని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉద్యోగి కళ్లకు గంతలు కట్టుకుని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో చెట్టుకింద ఓపీ నిర్వహించి నిరసన చేపట్టగా... డీసీసీ ఆధ్వర్యంలో ఎడ్ల బళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ర్ట మంత్రులు రాజీనామాలు చేయాలంటూ స్థానిక పూల్‌బాగ్‌లో పీజీ కళాశాల హాస్టల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు విజయనగరం- పాలకొండ రహదారిపై బైఠాయించి, అనంతరం వంటా వార్పు నిర్వహించారు.  కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డును కుక్క మెడలో వేసి ఊరేగించి నిరసన వ్యక్తం చేశారు. 
 
నెల్లిమర్ల మండల కేంద్రంలో ఏపీ ఎన్జీఓ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం జరుగుతుండగా అటువైపు వచ్చిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు తెలుగుదేశం పూర్తిస్థాయిలో మద్దతు తెలపాలని నినదించారు. భోగాపురంలో ఆటో వాలాలు తమ ఆటోలను నిలుపుదల చేయటమే కాకుండా జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి ఆటోను నిలిపివేశారు. డెంకాడ మండలంలో   ఎన్జీఓల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, కేసీఆర్, బొత్స తదితరుల వేషధారులతో  ప్రధాన రహదారిపై భజన కార్యక్రమం నిర్వహించగా.. పట్టణంలో ఉన్న ఫ్లాట్ రిక్షా కార్మికులు ప్రధాన రహదారిని దిగ్బంధించి, అష్టాచమ్మా  ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.
 
విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో మానవహారం-రాస్తారోకో  నిర్వహించారు. పర్ల గ్రామస్తులు భారీ ర్యాలీ, మూడు రోడ్ల జంక్షన్‌లో మంత్రి బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.  పలువురు సమైక్యవాదులు డప్పులు, ఇతర వాయిద్యాలతో నృత్యాలు-కోలాటం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్.కోటలో వర్తక, వ్యాపార సంఘాల పిలుపు మేరకు బంద్, ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవీ జంక్షన్‌లో వంటా-వార్పు, సహపంక్తి భోజనాలు చేశారు. గజపతినగరం మండలంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. సాలూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది.  జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు,  నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. 
 
బొబ్బిలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ, జేఎసీ ఆధ్వర్యంలో ఇందిర కాంతి పథం మహిళలతో భారీ ర్యాలీ, కోర్టు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. డీసీసీ ఆధ్వర్యంలో 40 కిలోమీటర్ల మేర నాటుబళ్లతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే చెరువుల్లో నీరు కూడా ఉండదని, ఈ నేపథ్యం లో చెరువుల్లో బతికే కప్పలు ఎటువంటి  తిప్ప లు పడతాయో భవిష్యత్‌లో సీమాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి అలానే ఉంటుందని తెలుపు తూ  ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కప్ప ల్లా గెంతుతూ నిరసన వ్యక్తం చేశారు.  బొబ్బిలి మండలం పక్కిలో ఎడ్ల బళ్ల ర్యాలీ, కింతలివాని పేటలో వంటావార్పు, అలజంగిలో చైతన్య ర్యాలీలు నిర్వహించారు. తెర్లాంలో కళాశాల విద్యార్థులు రోడ్డుపై పరీక్షలు రాసి నిరసన తెలిపిన అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహ నం చేశారు. 
 
బాడంగిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేయగా...జీకేఆర్ పురంలో సమైక్యాంధ్ర బంద్ నిర్వహించి  సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు  దహన సంస్కారాలు చేశారు. పార్వతీపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆటోడ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పణుకుపేట జంక్షన్‌లో మంత్రి బొత్స, సొనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీతానగరంలో 15 కిలోమీటర్ల పొడవు న జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహిం చారు. కురుపాంలో మోటారు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. జియ్యమ్మవలసలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించగా  గరుగుబిల్లిలో ఆటోల బంద్ కొనసాగుతోంది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement