'బీజేపీ- శివసేనల బంధానికి ఎప్పటికీ బ్రేక్ పడదు'
న్యూఢిల్లీ: బీజేపీ- శివసేనల మధ్య పొత్తు ఎప్పటిలాగే కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బీజేపీ-శివసేనల మధ్య పొత్తు అంశం తాజాగా పుట్టుకొచ్చినదేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. శివసేన-బీజేపీల విభేదాల అంశంపై వివరణ ఇచ్చారు. బీజేపీ-శివసేనల మధ్య పొత్తు ఇప్పటికాదని , ఎప్పట్నుంచో రెండు పార్టీల మధ్య పొత్తు ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పుడు శివసేన తమతో పొత్తు తెగదెంపులు చేసుకుంటుందని తాను భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీతో శివసేన ఎప్పటికీ దూరంగా ఉండదన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు పొడచూపాయి. ఎమ్మెన్నెస్ కు బీజేపీ దగ్గర కావటమే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహానికి కారణం. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్ సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా చేశారు. దాంతో బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చలు చోటుచేసుకున్నాయి.