General Physicians
-
రమణీయం.. ఛాయాచిత్రం
గుంటూరు మెడికల్: నాడి పట్టి రోగాలను నయం చేయటంలో నిత్యం బిజీగా ఉండే గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు వైల్డ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుని గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకపక్క జనరల్ ఫిజీషియన్‌గా రోగుల ప్రాణాలు కాపాడుతూ.. మరో పక్క అడవుల్లో సంచరించే క్రూర మృగాల కదలికలను తన కెమెరాతో క్లిక్‌మనిపించి బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి ఏఆర్పీఎస్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 22 ఎంట్రీలు ఈ ఫెలోషిప్‌కు పోటీపడగా కేవలం నాలుగు మాత్రమే సొసైటీ ఆమోదం పొందాయి. వాటిలో భారత దేశం నుంచి ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ నరేంద్ర వెంకటరమణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్పీఎస్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ వెంకటరమణ రికార్డు సృష్టించారు. ఏడేళ్లుగా కెమెరాతో గురి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ వెంకటరమణ ఏడు సంవత్సరాలు మూడు తరాలకు చెందిన 80 పులుల ఫొటోలు తీసి అంతర్జాతీయ పోటీలకు పంపించగా, న్యాయ నిర్ణేతలు ఆ ఫొటోలకు మంత్ర ముగ్ధులై ఆయనకు సాహస ఫొటోగ్రఫీకి అవార్డు ప్రకటించారు. డాక్టర్ వెంకటరమణ గత 15 ఏళ్లుగా వన్య ప్రాణుల చాయాచిత్రాలు తీసేందుకు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా దేశాలతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని వన్య ప్రాణుల కేంద్రాలను సందర్శించి, జంతువుల జీవన విధానం, వివిధ దశల్లో వాటి పెరుగుదల, కలిసి మెలిసి జీవించే దృశ్యాలు, వేటాడే దృశ్యాలు తీశారు. చిన్ననాటి నుంచే ఆసక్తి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తండ్రి డాక్టర్ గోపాలరావు రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీంతో ఒక పక్క తండ్రి మాదిరిగా వైద్యుడు అవ్వాలనే లక్ష్యంతో డాక్టర్ కోర్సు అభ్యసిస్తూనే 2000 సంవత్సరం నుంచి ఫొటోగ్రఫీలో సైతం మెలకువలు నేర్చుకున్నారు. కర్నాటకు చెందిన డీఎన్ఏ పెరుమాళ్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ మోహన్‌దాస్‌ల వద్ద శిష్యుడిగా చేరి వైల్డ్ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఏడాదికి ఒకసారి ప్రకృతితో మమేకం అయ్యేందుకు అడవులకు వెళ్లి జంతువులు, పక్షుల ఫొటోలను తన కెమెరా కళ్లతో బంధిస్తున్నారు. చేతితో చిత్రాలు గీసే కల్చర్ ఆర్ట్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వాయించడంతోపాటు ఫ్లూట్తో పలు గీతాలను ఆలపించడంతో సైతం నైపుణ్యం ఉంది. అందుకున్న డిగ్రీలు, అవార్డులు... ఫొటోగ్రఫీలో డాక్టర్ వెంకటరమణ నైపుణ్యాన్ని గుర్తించిన అమెరికా దేశంలోని పలు సంస్థలు డిగ్రీలను అందజేశాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఏఆర్పీఎస్, అమెరికాకు చెందిన ఎంఐఐసీఎస్, ఈయూఎస్పీఏ, ఆ్రస్టేలియాకు చెందిన ఏఏపీఎస్, ఇండియాకు చెందిన ఏఐఐపీసీ సంస్థలు, అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషన్ కొలీగ్స్ సొసైటీ, అసోసియేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ సొసైటీ ఫొటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీలను, ఫెలోషిఫ్లను అందించాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఢిల్లీ, కేరళ సొసైటీ బెటర్ ఆర్ట్ ఫౌండేషన్, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ, పలు జాతీయ సంస్థల నుంచి 15కు పైగా అవార్డులను, ఇంటర్నేషనల్ యాక్సిటెన్సీ 200లకు డాక్టర్ వెంకటరమణ అవార్డు అందుకున్నారు. -
డా‘‘ రోల్ మోడల్: వయసు మరచి కలలు కనండి
యవ్వనంలో ఉన్న అమ్మాయికి గానీ అబ్బాయిలకు గానీ కాస్త ఈ పనిచేయండి? అని దేనిగురించి అయినా చెప్పామంటే..‘‘నా వల్ల కాదని కొందరు చెబితే, మరికొందరు నాకే చాలా పని ఉంది మళ్లీ ఇది చేయాలా? అని సణుగుతారు. ఇటువంటి యంగ్ జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఆరుపదులు దాటిన అమ్మమ్మలు, నాయనమ్మలు కొందరు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, మరికొందరు డెభైఏళ్ల వయసులోనూ కొత్త బిజినెస్‌లు ప్రారంభించి ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డాక్టర్ గీతా ప్రకాష్ ఈ కోవకు చెందిన వారే అయినప్పటికీ... వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి ఏకంగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. పేరులోనే తెలుస్తోంది ఆమె ఒక డాక్టర్ అని. ముఫ్పైఏళ్లపాటు డాక్టర్‌గా పనిచేసిన తరువాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మంచి మోడల్‌గా మారింది గీత. ఒకపక్క డాక్టర్‌గా సేవలందిస్తూనే, 67 ఏళ్ల వయసులో లేటెస్ట్ మోడల్‌గా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన గీతా ప్రకాష్ వైద్యవిద్యపూర్తయ్యాక జనరల్ ఫిజీషియన్‌గా బాధ్యతలు చేపట్టింది. ఒక డాక్టర్‌గా జీవితం ఎంతో సంతృప్తిగా సాగుతోంది. రోజూ తన క్లినిక్‌కు వచ్చే రోగులను చూడడం, వారి బాధలకు మందులు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడడం ఆమె దైనందిన చర్యగా మారింది. ఓ రోజు ఇటలీకి చెందిన ఓ ఫొటో గ్రాఫర్ ట్రీట్మెంట్ కోసం గీత దగ్గరకు వచ్చాడు. తన ట్రీట్మెంట్ పూర్తయ్యాక..ఫొటోగ్రాఫర్ కాస్త చనువు తీసుకుని ..‘‘మేడమ్! మీ ముఖం చాలా కళగా అందంగా ఉంది. మీరెందుకు మోడలింగ్ చేయకూడదు’’అని సూచించాడు. ఓ పేషెంట్ తనకు అస్సలు సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడాన్ని గీత చిన్నగా నవ్వి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది. యాభైఏడేళ్ల వయసులో... కొన్ని నెలల తరువాత ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ నుంచి గీతకు ఉత్తరం వచ్చింది. ‘‘మేడమ్! మీ ఫొటోలు పంపించండి’’ అని ఆ ఉత్తర సారాంశం. ఆ ఫొటోగ్రాఫర్ మాటలు ప్రోత్సాహకరంగా ఉండడంతో గీతకు నచ్చాయి. దీంతో ‘‘చూద్దాం అతను చెబుతున్నాడు, కాబట్టి మోడలింగ్ చేద్దాం’’ అనుకుంది. అప్పటిదాకా ఫొటోల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో..ఎప్పుడూ మంచిగా రెడీ అయ్యి ఫొటోలు దిగలేదు. అప్పుడప్పుడూ దిగిన అత్యంత సాధారణ ఫొటోలను తన పిల్లలతో చెప్పి ఫొటోగ్రాఫర్‌కు పంపించింది. ఈ ఫొటోలు ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీకి నచ్చడంతో...అతను రూపొందించిన ‘కనీ’ శాలువాకు మోడలింగ్ చేసేందుకు గీత ఎంపికైంది. ఆ శాలువా ధరించి 57 ఏళ్ల వయసులో తొలిసారి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ శాలువాలు గీత వయసువారు ధరించేవి కావడం, పైగా ‘కనీ’ శాలువాలు గీతకు బాగా నప్పడంతో ఆ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయింది. దాంతో ఆమె మోడల్‌గా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత జైపూర్ బ్రాండ్ వాళ్లు కూడా మోడల్‌గా పనిచేయమని ఆఫర్ ఇవ్వడంతో అప్పటి నుంచి గీత మోడలింగ్‌లో దూసుకుపోతోంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆరు పదుల వయసులో గీత మోడలింగ్‌లో రాణించడానికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలవడం విశేషం. ప్రతి మోడలింగ్ అసైన్‌మెంట్‌కు వెళ్లేటప్పుడు ఆమెను మరింత ఉత్సాహపరిచి పంపడం, గ్లాసీ పేపర్ల మీద వచ్చిన గీత ఫొటోలను చూపించి అభినందించేవారు. నా వృత్తిని ఆరాధిస్తాను... ‘‘వృత్తిని దేవుడుగా భావించి ఆరాధిస్తాను. మనపని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతాను’’ అని చెబుతూ.. ‘‘కలలు కనడం ఎప్పుడూ మానకండి, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం, ఇప్పుడు మనవల్ల ఏం అవుతుంది అని అస్సలు అనుకోవద్దు. వయసు ఏదైనా సరే... ఏదోఒకటి సాధించాలన్న కలను కనాలి. ఈ ప్రపంచంలో దేనికీ ఇంతవరకే అన్న పరిమితి లేదు. మన అలవాట్ల ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు’’. అని మహిళలకు పిలుపునిస్తోంది. డాక్టర్‌గానూ.. మోడల్‌గానూ... ఒకపక్క డాక్టర్‌గా బిజీగా ఉంటూనే గత పదేళ్లుగా మోడలింగ్‌లో రాణిస్తోంది గీతాప్రకాష్. మోడల్‌గా మారినప్పటికీ గీత తన డాక్టర్ వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు. వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తూ...మిగతా సమయంలో పేషంట్లను చూసేది. మోడలింగ్‌లో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో మరింత బాగా చేయడానికి ప్రయత్నించేది. మోడలింగ్‌ను ప్రేమిస్తూనే..తన ఇంట్లో చారిటబుల్ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అన్జు మోడీ, తరుణ్ తహిలియానీ, గౌరవ్ గుప్తా, టొరాణి, నికోబార్, జేపోర్, అష్దీన్ల వద్ద అందాల మోడల్‌గా రాణిస్తూ ఎంతో మంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో పలువురు జనరల్ ఫిజీషియన్లు, న్యూరాలజిస్ట్లు, న్యూరో సర్జన్లతో స్ట్రోక్స్ (మెదడు, నరాలు) సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆసక్తి ఉన్న వైద్యులందరూ రావచ్చునని ఐఎస్సీడీఎస్ (ఇంటర్నేషనల్ స్ట్రోక్ అండ్ సెరెబ్రొవాస్క్యులర్ సింపోజియం) కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ నబీల్ ఎ హెరియల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లల్లో మెదడు సంబంధిత బాధితుల సంఖ్య ఏటికేటికీ గణనీయంగా పెరుగుతోందని, నిపుణులైన వైద్యులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వైద్యులు ఈ నెల 14న ఉదయం తమ పేరు నమోదుచేసుకుని పాల్గొనవచ్చునన్నారు.