గుంటూరు మెడికల్: నాడి పట్టి రోగాలను నయం చేయటంలో నిత్యం బిజీగా ఉండే గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు వైల్డ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుని గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకపక్క జనరల్ ఫిజీషియన్‌గా రోగుల ప్రాణాలు కాపాడుతూ.. మరో పక్క అడవుల్లో సంచరించే క్రూర మృగాల కదలికలను తన కెమెరాతో క్లిక్‌మనిపించి బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి ఏఆర్‌పీఎస్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా 22 ఎంట్రీలు ఈ ఫెలోషిప్‌కు పోటీపడగా కేవలం నాలుగు మాత్రమే సొసైటీ ఆమోదం పొందాయి. వాటిలో భారత దేశం నుంచి ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ నరేంద్ర వెంకటరమణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్పీఎస్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ వెంకటరమణ రికార్డు సృష్టించారు.
ఏడేళ్లుగా కెమెరాతో గురి..
డాక్టర్ నరేంద్ర వెంకటరమణ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ వెంకటరమణ ఏడు సంవత్సరాలు మూడు తరాలకు చెందిన 80 పులుల ఫొటోలు తీసి అంతర్జాతీయ పోటీలకు పంపించగా, న్యాయ నిర్ణేతలు ఆ ఫొటోలకు మంత్ర ముగ్ధులై ఆయనకు సాహస ఫొటోగ్రఫీకి అవార్డు ప్రకటించారు.
డాక్టర్ వెంకటరమణ గత 15 ఏళ్లుగా వన్య ప్రాణుల చాయాచిత్రాలు తీసేందుకు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా దేశాలతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని వన్య ప్రాణుల కేంద్రాలను సందర్శించి, జంతువుల జీవన
విధానం, వివిధ దశల్లో వాటి పెరుగుదల, కలిసి మెలిసి జీవించే దృశ్యాలు, వేటాడే దృశ్యాలు తీశారు.
చిన్ననాటి నుంచే ఆసక్తి..
డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తండ్రి డాక్టర్ గోపాలరావు రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీంతో ఒక పక్క తండ్రి మాదిరిగా వైద్యుడు అవ్వాలనే లక్ష్యంతో డాక్టర్ కోర్సు అభ్యసిస్తూనే 2000 సంవత్సరం నుంచి ఫొటోగ్రఫీలో సైతం మెలకువలు నేర్చుకున్నారు. కర్నాటకు చెందిన డీఎన్‌ఏ పెరుమాళ్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ మోహన్‌దాస్‌ల వద్ద శిష్యుడిగా చేరి వైల్డ్ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు.
ఏడాదికి ఒకసారి ప్రకృతితో మమేకం అయ్యేందుకు అడవులకు వెళ్లి జంతువులు, పక్షుల ఫొటోలను తన కెమెరా కళ్లతో బంధిస్తున్నారు. చేతితో చిత్రాలు గీసే కల్చర్ ఆర్ట్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వాయించడంతోపాటు ఫ్లూట్‌తో పలు గీతాలను ఆలపించడంతో సైతం నైపుణ్యం ఉంది.
అందుకున్న డిగ్రీలు, అవార్డులు...
ఫొటోగ్రఫీలో డాక్టర్ వెంకటరమణ నైపుణ్యాన్ని గుర్తించిన అమెరికా దేశంలోని పలు సంస్థలు డిగ్రీలను అందజేశాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఏఆర్‌పీఎస్, అమెరికాకు చెందిన ఎంఐఐసీఎస్, ఈయూఎస్‌పీఏ, ఆ్రస్టేలియాకు చెందిన ఏఏపీఎస్, ఇండియాకు చెందిన ఏఐఐపీసీ సంస్థలు, అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషన్ కొలీగ్స్ సొసైటీ, అసోసియేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ సొసైటీ ఫొటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీలను, ఫెలోషిఫ్‌లను అందించాయి.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఢిల్లీ, కేరళ సొసైటీ బెటర్ ఆర్ట్ ఫౌండేషన్, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ, పలు జాతీయ సంస్థల నుంచి 15కు పైగా అవార్డులను, ఇంటర్నేషనల్ యాక్సిటెన్సీ 200లకు డాక్టర్ వెంకటరమణ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment