general stores
-
Telangana: వ్యాపారులకు శుభవార్త.. ఇక 24 గంటలూ షాపులు తెరవొచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని జీవో జారీ చేశారు. తదనుగుణంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988కు సవరణలు చేసినట్టు తెలిపారు. 24 గంటలపాటు దుకాణం తెరిచి ఉంచేందుకు గాను ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే ఈ జీవో అమలులో ఈ కింది పది నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఐడీ కార్డులు జారీ చేయాలి వారాంతపు సెలవు ఇవ్వాలి వారంలో కచ్చితమైన పనిగంటలు ఉండాలి ఓవర్ టైమ్‌కు వేతనం చెల్లించాలి పండుగలు, సెలవు దినాల్లో పని చేసినవారికి కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి మహిళా ఉద్యోగులకు తగిన వేతనం ఇవ్వాలి రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల అంగీకారం తీసుకోవాలి.. రవాణా సదుపాయం కల్పించాలి రికార్డులను సరిగా మెయింటైన్ చేయాలి పోలీస్‌యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
ఆఫర్లు లేవు... క్యాష్‌బ్యాక్ రాదు!
అనిరుధ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంటికి అవసరమైన సరుకులు, ఇతరత్రా కొనుగోలుకు సంబంధించిన నెలవారీ ఖర్చులన్నీ డిజిటల్ చెల్లింపులతోనే పూర్తి చేస్తాడు. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఇతర కూపన్లు వస్తుండటమే కారణం. కానీ రెండు నెలలుగా డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు రాలేదు. అలాగే ఎలాంటి కూపన్లు రాలేదు. కొన్ని సందర్భాల్లో డిజిటల్ చెల్లింపులతో పోలిస్తే సాధారణ కొనుగోలులో తక్కువ ధరకే వస్తుండటంతో అవసరాన్ని బట్టి చెల్లింపులు చేస్తున్నాడు. (ఐసీయూ తరహాలో..) సందీప్ తండ్రికి షుగర్, బీపీ ఉంది. ప్రతి నెల ఓ బ్రాండెడ్ ఫార్మసీ దుకాణంలో మందులు కొనుగోలు చేస్తాడు. ఈ రెండు మందులకు ప్రతి నెల రూ.810 చెల్లిస్తాడు. వాస్తవానికి దుకాణాదారు ఈ మాత్రల ఎంఆర్పీ ధరపై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుండేవాడు. కానీ ఇటీవల మాత్రలు కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎంఆర్పీ ధరకే మందులు ఇస్తున్నట్లు చెబుతూ రూ.952 తీసుకున్నాడు. ఇదేమిటని అడిగితే కంపెనీ ఆఫర్ ఇవ్వడం లేదని చేతులు దులుపుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో తలపెట్టిన లాక్డౌన్ సగటు వ్యక్తి ఖర్చులపై తీవ్ర ప్రభావానే చూపుతోంది. లాక్డౌన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లో పరిస్థితులు భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సడలింపులతో నిత్యావసర సరుకుల దుకాణాలే కాకుండా ఇతర వ్యాపార సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే వ్యాపార శైలిలో భారీ మార్పులొచ్చాయి. గతం లో సరుకులను కొంత తగ్గిం పు ధరకు అమ్మగా, ఇప్పుడు ఎంఆర్పీకే విక్రయిస్తున్నా రు. దీంతో సరుకులు కొనుగోలు చేసేవారు ఉసూరుమంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చాలా దుకాణాల్లో నిర్దేశిత మొత్తంలో కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉండేవి. నిత్యావసరాల కొనుగోలుపై ఈ ఆఫర్లు భారీగా ఉండేవి. సూపర్ మార్కెట్లలో ఒకటి కొంటే మరోటి ఉచితం లాంటి ఆఫర్లు చాలా కనిపించేవి. కొన్ని సరుకులపై 10 శాతం, 20 శాతం డిస్కౌంట్లు ఉండేవి. ప్రస్తుతం వ్యాపార సంస్థలు వీటికి పూర్తిగా మంగళం పాడేశాయి. డిజిటల్ చెల్లింపుల్లో ఆఫర్లు కట్... అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేవి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి సంస్థలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో చాలా మంది ఈ చెల్లింపులకు అలవాటుపడ్డారు. రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపులతో పాటు నగదు బదిలీ చేయడంపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భారీగానే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ ప్రోత్సాహకాలను ఆయా కంపెనీలు ఇవ్వడం లేదు. ఎలాంటి లావాదేవీలు చేసినా క్యాష్‌బ్యాక్ రావడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ తన సరఫరా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. పండుగల సీజన్ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే ఆర్డర్లను అంతే వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లను చేర్చుకుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు, కస్టమర్లను చేరుకోవడం కంపెనీకి వీలు పడుతుందని, అదే సమయంలో కిరాణా స్టోర్లకు ఆదాయం పెరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా రానున్న బిగ్ బిలియన్ డేస్ కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త కస్టమర్లను చేరుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. ‘‘ఆరు నెలల క్రితమే దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్ల చేరిక మొదలైంది. రానున్న పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నాం. కిరాణా స్టోర్లు అన్నవి దేశంలో ఎంతో కాలంగా ఉన్న రిటైల్ విధానం. డిజిటల్ చెల్లింపుల అనంతరం, కిరాణాలో తదుపరి విప్ల వం ఈ కామర్స్‌తో అనుసంధానించడమే’’ అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. -
ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దుకాణాదారులు, రెస్టారెంట్లు మొదలైనవి కూడా వైఫై సేవలను విక్రయించే వెసులుబాటు తేవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. గతకాలపు పబ్లిక్ ఫోన్ బూత్‌ల (పీసీవో) తరహాలో ఈ వైఫై సర్వీసులు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వైఫై హాట్‌స్పాట్స్‌ను పెంచే క్రమంలో పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో)ల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది. అయితే, టెలికం సేవల సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో గతంలో దాన్ని పక్కన పెట్టారు. అయితే, ఏదో ఒక రూపంలో పీడీవో తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ప్రస్తుత సైబర్ కేఫ్‌ల నిబంధనలకు లోబడి.. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీవోఏ) గతకాలపు పీసీవో తరహా సెటప్‌లో ఇంటర్నెట్ సర్వీసులు విక్రయించే అంశం పరిశీలించవచ్చని ట్రాయ్ సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటికే తీవ్ర రుణభారంలో ఉన్న పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని, జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరమని టెలికం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
స్థానికులకు గండికొట్టి.. తమ్ముళ్లకు పంచిపెట్టి..!
అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లుంది టీటీడీ పరిస్థితి. గతంలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇళ్లు పోగొట్టుకున్న స్థానికులను కాదని అధికార పార్టీకి చెందిన స్థానికేతరులకు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం పాపవినాశనంలో ఉన్న దుకాణాలను తిరుమలకు బదిలీ చేయాలని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. నేటికీ అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్త లైసెన్సుల జారీలో కొందరు అధికారులు, పాలకులు అత్యుత్సాహం చూపుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల అవసరాల దృష్ట్యా గతంలో స్థానికంగా ఉన్న వారికి దుకాణాలు కేటాయించింది టీటీడీ. మాస్టర్‌ప్లాన్‌లో వాటిని తొలగించారు. వారికి బాలాజీనగర్‌లో వసతి ఏర్పాటు చేశారు. జీవనాధారానికి అవసరమైన దుకాణాలను పాపవినాశనానికి తరలించారు. 15 ఏళ్ల నుంచి వారు అక్కడే వ్యాపారాలు సాగిస్తున్నారు. పాపవినాశనం ప్రాంతం తమ అధీనంలో ఉందంటూ కేంద్ర అటవీశాఖ అధికారులు అడ్డుపుల్ల వేశారు. అప్పటి నుంచి టీటీడీ, అటవీశాఖ అధికారుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం పాపవినాశనంలోని దుకాణాలను ఖాళీ చేయాలంటూ ఫారెస్ట్ అధికారులు హుకుం జారీచేశారు. టీటీడీ అధికారులు జోక్యం చేసుకుని వారితో చర్చలు జరిపారు. నెలవారీ అద్దె చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. నెరవేరని హామీ పాపవినాశనంలోని దుకాణాలను తిరుమలకు తరలించాలని స్థానికులు గత ఈఓ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లారు. తర్వాత వచ్చిన ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ పాపవినాశనంలోని టీటీడీ లైసెన్సులు కలిగిన దుకాణాలను తిరుమలకు బదిలీ చేయాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికి 15 నెలలు కావస్తున్నా నేటికీ అది అమలుకాలేదు. కొండపై తెలుగు తమ్ముళ్ల హవా.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు.. అధికారం ఉన్నప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని టీడీపీ నేతలు కొందరు ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగానే వారి కన్ను టీటీడీపై పడింది. తిరుమలలో లైసెన్సులు పొందితే డబ్బులు పుష్కలంగా సంపాదించవచ్చని భావిస్తున్నారు. ఎలాగైనా లైసెన్సులు పొందేందుకు టీటీడీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వందలాది లైసెస్సులు తమ అనుకూలురుకే ఇప్పించాలని హుకుం జారీ చేస్తున్నారు. భద్రతకు ముప్పు తప్పదా? స్థానికేతరులకు దుకాణాల లైసెన్సులు కట్టబెడితే టీటీడీకి భద్రత సమస్య తప్పదని విజిలెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో పనిచేసిన భద్రతా అధికారి రవికృష్ణ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తిరుమలకు ముప్పుతప్పదని రిపోర్టు కూడా ఇచ్చారు. కానీ వాటిని ఇటు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. -
వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు
-
దొంగలను పట్టించిన మేక...!
మెదక్(హత్నూర): మేకను దొంగలించేందుకు ప్రయత్నించిన దొంగలు అడ్డంగా దొరికిపోయారు . రెండుషాపుల్లో చోరీ చేయడంతో పాటు మేకను దొంగలించేందుకు యత్నించిన సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామంలోని పోలీస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీరామ ఫొటోస్టూడియో, పక్కనే ఉన్న కిరాణషాపులో వెనుకభాగంలో ఉన్న కిటికీల రాడ్లను వంచి ఫొటో స్టూడియోలోని కంప్యూటర్లను ధ్వంసం చేయడంతోపాటు 13వేల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాదితుడు రామస్వామి తెలిపారు. కిరాణషాపులో నుంచి సామాన్లు పోయినట్లు బాదితుడు మధు తెలిపారు. రెండుషాపుల వెనుకభాగంలో ఉన్న ఓ ఇంటి ముందు మేకను దొంగలు తీసుకెళ్ళె ప్రయత్నంలో దొరికిపోయారు. కొందరు పారిపోయారు. ఫొటోస్టూడియో చోరీకి పాల్పడిన ఓ దొంగ దొరకడంతో అదే రాత్రి పోలీసులకు అప్పగించారు. గురువారం ఉదయం బాదితులు పోలీస్టేషన్లో పిర్యాదు చేశారు. -
కిరాణా షాపులపై పోలీసుల దాడులు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో శనివారం కిరాణా షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచరాం మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. (డిచ్పల్లి)