అనిరుధ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇంటికి అవసరమైన సరుకులు, ఇతరత్రా కొనుగోలుకు సంబంధించిన నెలవారీ ఖర్చులన్నీ డిజిటల్ చెల్లింపులతోనే పూర్తి చేస్తాడు. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఇతర కూపన్లు వస్తుండటమే కారణం. కానీ రెండు నెలలుగా డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు రాలేదు. అలాగే ఎలాంటి కూపన్లు రాలేదు. కొన్ని సందర్భాల్లో డిజిటల్ చెల్లింపులతో పోలిస్తే సాధారణ కొనుగోలులో తక్కువ ధరకే వస్తుండటంతో అవసరాన్ని బట్టి చెల్లింపులు చేస్తున్నాడు. (ఐసీయూ తరహాలో..)
సందీప్ తండ్రికి షుగర్, బీపీ ఉంది. ప్రతి నెల ఓ బ్రాండెడ్ ఫార్మసీ దుకాణంలో మందులు కొనుగోలు చేస్తాడు. ఈ రెండు మందులకు ప్రతి నెల రూ.810 చెల్లిస్తాడు. వాస్తవానికి దుకాణాదారు ఈ మాత్రల ఎంఆర్‌పీ ధరపై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుండేవాడు. కానీ ఇటీవల మాత్రలు కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎంఆర్‌పీ ధరకే మందులు ఇస్తున్నట్లు చెబుతూ రూ.952 తీసుకున్నాడు. ఇదేమిటని అడిగితే కంపెనీ ఆఫర్ ఇవ్వడం లేదని చేతులు దులుపుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో తలపెట్టిన లాక్‌డౌన్ సగటు వ్యక్తి ఖర్చులపై తీవ్ర ప్రభావానే చూపుతోంది. లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లో పరిస్థితులు భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సడలింపులతో నిత్యావసర సరుకుల దుకాణాలే కాకుండా ఇతర వ్యాపార సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే వ్యాపార శైలిలో భారీ మార్పులొచ్చాయి. గతం లో సరుకులను కొంత తగ్గిం పు ధరకు అమ్మగా, ఇప్పుడు ఎంఆర్‌పీకే విక్రయిస్తున్నా రు.
దీంతో సరుకులు కొనుగోలు చేసేవారు ఉసూరుమంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చాలా దుకాణాల్లో నిర్దేశిత మొత్తంలో కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉండేవి. నిత్యావసరాల కొనుగోలుపై ఈ ఆఫర్లు భారీగా ఉండేవి. సూపర్ మార్కెట్లలో ఒకటి కొంటే మరోటి ఉచితం లాంటి ఆఫర్లు చాలా కనిపించేవి. కొన్ని సరుకులపై 10 శాతం, 20 శాతం డిస్కౌంట్‌లు ఉండేవి. ప్రస్తుతం వ్యాపార సంస్థలు వీటికి పూర్తిగా మంగళం పాడేశాయి.
డిజిటల్ చెల్లింపుల్లో ఆఫర్లు కట్...
అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేవి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి సంస్థలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో చాలా మంది ఈ చెల్లింపులకు అలవాటుపడ్డారు. రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపులతో పాటు నగదు బదిలీ చేయడంపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భారీగానే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ ప్రోత్సాహకాలను ఆయా కంపెనీలు ఇవ్వడం లేదు. ఎలాంటి లావాదేవీలు చేసినా క్యాష్‌బ్యాక్ రావడంలేదని వినియోగదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment