General Woman
-
గ్రేటర్ బరి: మేయర్ పీఠంపై మహిళ గురి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. గ్రేటర్ పీఠాన్ని మరోమారు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ఖరారు మొదలుకుని, సమన్వయం, ప్రచారం తదితర అంశాల్లో ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో డివిజన్ స్థాయి రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని మాత్రం జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వు చేశారు. దీంతో డివిజన్ స్థాయిలో విజయం సాధించి, గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్లో సుమారు డజను మంది మహిళా నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్టీలో పలువురు నాయకుల వారసులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నా.. సామాజికవర్గ సమీకరణలు, విధేయత, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శివారు డివిజన్లకే అవకాశం? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 150 డివిజన్లు.. 24 శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 84 డివిజన్లు శివారు నియోజకవర్గాల పరిధిలో ఉండగా, 66 డివిజన్లు పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో శివారు డివిజన్ చర్లపల్లి నుంచి గెలుపొందిన బొంతు రామ్మోహన్‌కు మేయర్ పీఠం దక్కింది. ఈసారి కూడా నగరం వెలుపల ఉన్న డివిజన్ల వారికే మేయర్ పదవి దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కోర్ సిటీ నుంచి ఎన్నికైన వారికి మేయర్ పదవి దక్కితే శివారు డివిజన్ల నుంచి డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వారసుల పోటాపోటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీనియర్ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ సీట్లను ఆశించినా కొందరికే అవకాశం దక్కింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుటుంబ సభ్యులు టికెట్లు ఆశించినట్లు ప్రచారం జరిగినా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల కుటుంబాలకు చెందిన సుమారు అరడజను మందికి కార్పొరేటర్లుగా టికెట్ దక్కడంతో వారు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవితో పాటు ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, సాయన్న, దివంగత నేతలు పి.జనార్ధన్‌రెడ్డి, చింతల కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. సామాజిక సమీకరణాలు.. విధేయత గ్రేటర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు మేయర్ పదవిని ఆశిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 31 డివిజన్లు కేటాయించగా, ఇందులో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని పార్టీలో అంతర్గతంగా లెక్కలు వేస్తున్నారు. అయితే రాజకీయ వారసులు కాకుండా పార్టీ నాయకత్వం పట్ల విధేయులుగా ఉండే వారికే మేయర్ పీఠం దక్కే సూచనలు ఉన్నాయని కొందరు నేతలు అంటున్నారు. టీఆర్ఎస్లో ‘మేయర్’ ఔత్సాహికులు ►బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ డివిజన్ నుంచి బరిలో ఉన్న దివంగత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఔత్సాహికుల జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు. ►ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి (చర్లపల్లి), ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్నారెడ్డి (హబ్సిగూడ), కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత (కవాడిగూడ) కూడా మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. ►మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సుసరితారెడ్డి (మూసారాంబాగ్), మరో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి (అల్వాల్) ఔత్సాహికుల జాబితాలో ఉన్నారు. ►రెండు పర్యాయాలు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామ్మోహన్‌గౌడ్ భార్య ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్ (బీఎన్‌రెడ్డి), టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతె శోభన్‌రెడ్డి భార్య శ్రీలత (తార్నాక) కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. ►రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టే పక్షంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు దుర్గాప్రసాద్‌రెడ్డి భార్య పద్మావతిరెడ్డి, ప్రస్తుత హఫీజ్‌పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ పేర్లు కూడా తెరమీదకు వచ్చే అవకాశముందని అంటున్నారు. -
పొత్తు వెనుక ఎత్తు
దేవరకొండ, న్యూస్‌లైన్ పీఏపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తేర గోవర్దన్‌రెడ్డి కూతురు తేర స్పందనరెడ్డి , వైఎస్సార్సీపీ నుంచి సపావత్ సాలి, బీజేపీ నుంచి పల్లా మంజుల, సీపీఎం నుంచి కంబాలపల్లి కవిత, స్వతంత్ర అభ్యర్థిగా సాహితి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బలమైన నాయకుడైన గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈపొత్తు రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చే అవకాశమున్నందున టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అలుగుబెల్లి వెంకటేశ్వర్‌రెడ్డి తన సతీమణి శోభారాణిని పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. టీడీపీ తన అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్తో జతకలిసి గోవర్దన్రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇక్కడ సరికొత్త ట్రెండుకు తెరలేపింది. వీరు టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ జెండాలతోనే బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం మరికొందరు అభ్యర్థులు కూడా రంగంలో ఉండి ఉడతాభక్తిగా ఇటు గోవర్దన్‌రెడ్డి వర్గం, అటు వెంకటేశ్వర్ రెడ్డి వర్గాలకు సహకరిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా విభిన్నమైన కలయికతో ఇక్కడ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి. -
జెడ్పీ పీఠం మహిళకే
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఈ దఫా మహిళ ఎంపిక కానున్నారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్లను అధికారులు శనివారం ఖరారు చేశారు. శ్రీకాకుళం జెడ్పీ అధ్యక్ష స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించినట్లు జిల్లా అధికారులకు వర్తమానం అందింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడడంతో మహిళలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఆవిర్భవించాక 1985 నుంచి పదేళ్లపాటు డాక్టర్ కిమిడి మృణాళిని చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఇన్నేళ్ల తర్వాత మహిళలకు మళ్లీ అవకాశం దక్కుతోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండడంతో జిల్లాలోని 38 జెడ్పీటీసీలలో 19 స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటిలో ఎన్నికైనవారిలో ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారు. ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాలోని 38 మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీల) రిజర్వేషన్లను కూడా అధికారులు ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను రెండు రోజుల క్రితమే ప్రకటించిన అధికారులు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఎంపీపీల రిజర్వేన్లను ఖరారు చేసి కలెక్టర్‌కు నివేదించారు. వీటిని కలెక్టర్ సౌరభ్ గౌర్ శనివారం ఆమోదించారు. వివరాలు.. ఓసీ జనరల్: రణస్థలం, సంతకవిటి, శ్రీకాకుళం, పొందూరు, ఎచ్చెర్ల ఓసీ మహిళ: పలాస, ఆమదాలవలస, గార, సంతబొమ్మాళి, పోలాకి బీసీ జనరల్ : జి.సిగడాం, సారవకోట, లావేరు, ఎల్.ఎన్.పేట, టెక్కలి, రాజాం, సరుబుజ్జిలి, నరసన్నపేట, రేగిడి ఆమదాలవలస, కోటబొమ్మాళి. బీసీ మహిళ : హిరమండలం, మందస, పాల కొండ, కంచిలి, వంగర, నందిగాం, కవిటి, జలుమూరు,సోంపేట,ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు. ఎస్సీ జనరల్ : బూర్జ, కొత్తూరు ఎస్సీ మహిళ : వీరఘట్టం, భామిని ఎస్టీ జనరల్ : పాతపట్నం ఎస్టీ మహిళ : మెళియాపుట్టి, సీతంపేట