జెడ్పీ పీఠం మహిళకే
Published Sun, Mar 9 2014 3:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఈ దఫా మహిళ ఎంపిక కానున్నారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్లను అధికారులు శనివారం ఖరారు చేశారు. శ్రీకాకుళం జెడ్పీ అధ్యక్ష స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించినట్లు జిల్లా అధికారులకు వర్తమానం అందింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడడంతో మహిళలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఆవిర్భవించాక 1985 నుంచి పదేళ్లపాటు డాక్టర్ కిమిడి మృణాళిని చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఇన్నేళ్ల తర్వాత మహిళలకు మళ్లీ అవకాశం దక్కుతోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండడంతో జిల్లాలోని 38 జెడ్పీటీసీలలో 19 స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటిలో ఎన్నికైనవారిలో ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారు.
ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు
జిల్లాలోని 38 మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీల) రిజర్వేషన్లను కూడా అధికారులు ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను రెండు రోజుల క్రితమే ప్రకటించిన అధికారులు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఎంపీపీల రిజర్వేన్లను ఖరారు చేసి కలెక్టర్‌కు నివేదించారు. వీటిని కలెక్టర్ సౌరభ్ గౌర్ శనివారం ఆమోదించారు. వివరాలు..
ఓసీ జనరల్: రణస్థలం, సంతకవిటి, శ్రీకాకుళం, పొందూరు, ఎచ్చెర్ల
ఓసీ మహిళ: పలాస, ఆమదాలవలస, గార, సంతబొమ్మాళి, పోలాకి
బీసీ జనరల్ : జి.సిగడాం, సారవకోట, లావేరు, ఎల్.ఎన్.పేట, టెక్కలి, రాజాం, సరుబుజ్జిలి, నరసన్నపేట, రేగిడి ఆమదాలవలస, కోటబొమ్మాళి.
బీసీ మహిళ : హిరమండలం, మందస, పాల కొండ, కంచిలి, వంగర, నందిగాం, కవిటి, జలుమూరు,సోంపేట,ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు.
ఎస్సీ జనరల్ : బూర్జ, కొత్తూరు
ఎస్సీ మహిళ : వీరఘట్టం, భామిని
ఎస్టీ జనరల్ : పాతపట్నం
ఎస్టీ మహిళ : మెళియాపుట్టి, సీతంపేట
Advertisement