కథ సుఖాంతం
వివాదం రేపిన నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో జరిగిన సమన్వయ సంఘ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ పెద్దమనిషి పాత్ర పోషించి, పరిశ్రమ పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చింది. మహేశ్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆగడు’ సినిమా సెట్స్‌పై ప్రకాశ్‌రాజ్ తనను అసభ్యకరమైన భాషలో నిందించారంటూ కో-డెరైక్టర్ ఒకరు ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘా’నికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిందే. ఆ వ్యవహారం గత నెలలో చినికి చినికి గాలివానగా మారింది.
ప్రకాశ్‌రాజ్‌పై చర్య కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు వెళ్ళడమే కాక, తెలుగు సినిమాల్లో ప్రకాశ్‌రాజ్‌కు సహాయ నిరాకరణ చేయాలంటూ దర్శకుల సంఘంలో చర్చ రేగింది. ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం విధిస్తారని కూడా ప్రచారం సాగింది. ఆ పరిస్థితుల్లో వారం పదిరోజుల క్రితం ప్రకాశ్‌రాజ్ స్వయంగా విలేకరుల ముందుకు వచ్చి, ఈ వ్యవహారం వెనుక ఓ దర్శకుడు ఉన్నాడంటూ శ్రీను వైట్ల పేరును పరోక్షంగా ప్రస్తావించి, ప్రశ్నలు అడిగేందుకు అవకాశమివ్వకుండా వెళ్ళిపోయారు.
ఈ వివాదంపై ఫిల్మ్ చాంబర్లో దర్శకుల సంఘం, నిర్మాతల మండలి, నటీనటుల సంఘంతో ప్రతినిధులతో ఏర్పాటైన సమన్వయ సంఘం శుక్రవారం సమావేశమైంది. ఇందులో ప్రకాశ్‌రాజ్‌తో సదరు కో-డెరైక్టర్‌కు క్షమాపణ చెప్పించినట్లు సమా చారం. ప్రకాశ్‌రాజ్‌తో కొంత షూటింగ్ జరిపి, ఆనక అభిప్రాయ భేదాల కారణంగా అతని స్థానంలో సోనూ సూద్‌ను దర్శకుడు తేవడంతో, నిర్మాతలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. దాంతో, ప్రకాశ్‌రాజ్, శ్రీను వైట్లతో నిర్మాతకు నష్టపరిహారం ఇప్పించాలని తీర్మానించినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలేవీ తీసుకోరాదని నిర్ణయించారు.
అయితే, ఈ విషయంపై మరింత సమాచారం ఇచ్చేందుకు అటు దర్శకుల సంఘం వర్గాలు కానీ, ఇటు చాంబర్ వర్గాలు కానీ సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ‘చాంబర్ అధ్యక్షుడు ఎన్.వి. ప్రసాద్ మినహా మేమెవరం దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు. పత్రికలకు ఎక్కవద్దంటూ ముందే చెప్పేశారు. మా నోటికి తాళం వేశారు’ అని ఆ వర్గాలు పేర్కొనడం విశేషం.
ఈ వ్యవహారంలో దర్శకుల సంఘం ఇప్పటికే దూకుడుగా వ్యవహరించిందంటూ చాంబర్ పెద్దలు అక్షింతలు వేసినట్లు సమాచారం. శ్రీను వైట్ల, ప్రకాశ్‌రాజ్, నిర్మాత గోపి ఆచంట తదితరులు హాజరైన ఈ సమావేశంలో ‘‘అంతా సాఫీగా జరిగింది. ఇకపై ఇలాంటి వివాదాలతో పత్రికలకు ఎక్కరాదనుకున్నాం’’ అని సాయంత్రం పొద్దుపోయాక అందు బాటులోకొచ్చిన చాంబర్ అధ్య క్షుడు ఎన్.వి. ప్రసాద్ ‘సాక్షి’తో అన్నారు. వివరాలు మాత్రం వెల్లడించకుండా దాటేశారు. ఈ వివాదం సమసిపోయిందన్న మాట నిజమే కానీ, ‘దూకుడు’ లాంటి ఘన విజయంలో భాగస్వాములైన ప్రకాశ్‌రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య అభిప్రాయ భేదాలకు తెరపడిందా అన్నది బేతాళప్రశ్న.