రాళ్లలా కనిపిస్తున్నాయా?.. ఆరున్నర కోట్ల ఏళ్ల చరిత్ర దాగుంది
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్: చిత్రంలో కనిపిస్తున్నవన్నీ నత్తగుల్లలు.. రాళ్లలా కనిపిస్తున్నాయి కదా! ఎందుకంటే అవి ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటివి. శిలాజాలుగా మారి అలా రాళ్లలో ఇరుక్కుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా కరిమెరి పరిసరాల్లో ఈ నత్తగుల్లల శిలాజాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అహోబిలం కరుణాకర్ గుర్తించారు.
ద్వారం కుడివైపు తిరిగి ఉన్న ఈ అరుదైన, అలనాటి జాతి నత్తగుల్లల శిలాజాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి నది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో ఇంతకంటే పెద్ద నది ప్రవహించినట్టు జీఎస్ఐ గతంలో గుర్తించింది. ఆ మంచినీటి నదిలో పెరిగిన నత్తగుల్లలు ఇవి. తర్వాత లావా ఉబికివచ్చి ఈ ప్రాంతంలో ప్రవహించి ఘనీభవించింది. ఆ లావాలో చిక్కుకుని ఈ నత్తగుల్లలు కూడా రాతిలో రాళ్లుగా మారిపోయి ఇప్పుడు శిలాజాలుగా దర్శనమిస్తున్నాయి.
గతంలో తిర్యానీ ప్రాంతంలో ప్రిసా టెర్పోలెన్సిస్ జాతి నత్తగుల్లల శిలాజాలు వెలుగు చూశాయి. వాటికి భిన్నంగా ఇవి ప్రిసా ప్రిన్సిపీ ఉపజాతికి చెందిన నత్తగుల్లలని జీఎస్ఐ విశ్రాంత అధికారి చకిలం వేణుగోపాల్‌ను ఉటంకిస్తూ కరుణాకర్ తెలిపారు. ఇన్ని కోట్ల ఏళ్ల తర్వాత కూడా వాటి ఆకారం ధ్వంసం కాకుండా.. తాజా నత్త గుల్లల్లా కనిపిస్తుండటం విశేషం.