మరో విజ్ఞాన విప్లవం!!
ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం. ఇందుకు విద్యారంగం కూడా మినహాయింపు కాదు. నాటి గురుకులాల నుంచి నేటి మూక్స్ దాకా జ్ఞానార్జనలో ఎన్నో మైలురాళ్లు. గురుకులాల గురించి తెలుసు.. మరి అసలు మూక్స్ అంటే... మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. 21వ శతాబ్దపు టెక్నాలజీ అద్భుతం.. ఇంటర్నెట్ సాయంతో ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కోర్సులు అభ్యసించొచ్చు, సర్టిఫికెట్లు పొందొచ్చు. అదే మూక్స్.. అదెలా సాధ్యమో చూద్దాం.!!
ఒకప్పుడు ఆన్లైన్ విధానంలో కేవలం ఆయా ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ ఆ అవకాశం కల్పించేవి. ఇప్పుడు నేరుగా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం ద్వారా కోర్సులను సైతం అందిస్తుండటం వినూత్నం.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. అదే మూక్స్.. మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నిర్దిష్ట మూక్స్ వెబ్సైట్ ద్వారా ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులను ఆన్లైన్లోనే అభ్యసించి సర్టిఫికెట్లు సొంతం చేసుకోవచ్చు. మూక్స్ కాన్సెప్ట్.. అటు ప్రొవైడర్స్ కోణంలోనూ ఈ-బిజినెస్‌కు ఎంతో అనుకూలంగా మారింది. కారణం.. మూక్స్కు ఆకర్షితులవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా శరవేగంగా వృద్ధి చెందుతుండటమే.
మూక్స్కు మూలం!
ఈ-లెర్నింగ్‌లో నిర్దిష్ట సమయంలో మాత్రమే అధ్యాపకులు, సహచరులతో యాక్సెస్ ఉంటుంది. కానీ మూక్స్ విధానంలో ఆయా ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి. సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా.. తమకు ఇష్టమైన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలోని మూక్స్ కోర్సులకు నమోదు చేసుకుని సర్టిఫికెట్ పొందొచ్చు.
భారత విద్యార్థులకు ఎంతో మేలు
మూక్స్ విధానం భారత విద్యార్థులకు ఎంతో మేలు చేసేదని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి క్రేజీ కోర్సులు- అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందలేని విద్యార్థులు మూక్స్ విధానంలో నెరవేర్చుకునే అవకాశం లభిస్తోంది. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్-స్టూడెంట్ నిష్పత్తి సగటున 1:40గా ఉంటోంది. క్లాస్‌రూంలో అధ్యాపకులు చెప్పే అంశాలన్నిటినీ అవగతం చేసుకోవడం కష్టమైందే. అదే విధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు మూక్స్ పరిష్కారం చూపుతోంది.
ముంబైలో ఎడెక్స్
అంతర్జాతీయ మూక్స్ ప్రొవైడర్..ఎడెక్స్.. ఐఐటీ-ముంబైలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు అందిస్తోంది. ‘కోర్స్ ఎరా’.. ఐఐటీ-ఢిల్లీతో ఒప్పందం ద్వారా వెబ్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా కోర్సును ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-చెన్నైలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స (ఐఐఎస్సీ)- బెంగళూరు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
స్కిల్ గ్యాప్‌కు పరిష్కారం
మూక్స్ ద్వారా అకడమిక్స్, ఇండస్ట్రీ మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. కారణం.. కొన్ని మూక్స్ ప్రొవైడింగ్ సంస్థలు ఆయా సంస్థల కరిక్యులం, ఇండస్ట్రీ అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని వాటికి సరితూగే విధంగా సొంతగా సిలబస్ రూపకల్పన చేయడమే. ఇలాంటి మూక్స్ సర్టిఫికేషన్ అందుకుంటే సులువుగా ఉద్యోగాన్ని సంపాదించొచ్చు! అయితే అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో మూక్స్ కోర్సులు పెరగాల్సి ఉంది.
నెక్ట్స్ జెన్.. మూక్స్
మూక్స్.. స్కిల్స్ మెరుగుపరచుకునేందుకు ఎంతో ఉపయుక్తం. ఇప్పటికే ఆయా కెరీర్స్‌లో స్థిరపడి ఉన్నత హోదాలు అందుకోవాలనుకునే వారు కోర్సులు అభ్యసించి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఐటీ, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో మూక్స్కు ఆదరణ లభిస్తోంది. హ్యుమానిటీస్, ఆర్ట్స్ కోర్సుల్లోనూ ప్రపంచ శ్రేణి ఇన్స్టిట్యూట్ల నుంచి కోర్సులు అభ్యసించొచ్చు.
ఆధునిక టెక్నాలజీ
మూక్స్ అభ్యసించాలనుకునేవారికి ప్రాథమికంగా కావాల్సినవి.. ఇంటర్నెట్, జావా స్క్రిప్ట్ సాఫ్ట్వేర్, ఏవీ సాఫ్ట్వేర్స్, స్పీకర్స్. ఇవి ఉంటే ఆన్లైన్ విధానంలో మూక్స్ కోర్సులను ఇంటి నుంచే అభ్యసించొచ్చు. ఈ క్రమంలో ‘కోర్స్ ఎరా’ మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించింది. ఇలా.. మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు... మారుతున్న టెక్నాలజీతోపాటు తమ స్వరూపాన్ని, తీరుతెన్నులను కూడా మార్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత విద్య ఔత్సాహికులకు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి.
మూక్స్ ప్రయోజనాలు ఏంటి?
నచ్చిన ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ విద్యను అందుకోవచ్చు. ఇందులో నిరంతర నమోదు అవకాశం ఉంది. అంతేకాకుండా అధ్యాపకులతో నేరుగా సంభాషించే సౌలభ్యం లభిస్తోంది. నచ్చిన సమయంలో క్లాసులు వినొచ్చు. భారీ పరిమాణంలో ఉండే పుస్తకాలకు స్వస్తి పలికి, స్వల్ప పరిమాణంలో సమగ్ర సమాచారం అందుకోవచ్చు. కోర్సు కంటెంట్‌ను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కుదించి లైవ్ వీడియో లెక్చర్స్‌ను అందించడం, వర్చువల్ క్లాస్ రూం సదుపాయం కల్పించడం మూక్స్ విషయంలో ముఖ్యమైన అంశం. తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు కెరీర్ ఉన్నతికి తోడ్పడుతుంది.
అమెరికాలో వర్చువల్ క్లాస్ రూం
మూక్స్ ఆవిష్కరణ అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మిట్, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూం పేరుతో పలు కోర్సులను అందించడం మొదలుపెట్టాయి. ఇవి ఇప్పుడు భారతీయ విద్యార్థులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మూక్స్ విధానంలో అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో అమెరికాలో మూక్స్ కోర్సుల ప్రొవైడర్స్ భారత్‌వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం కుదుర్చుకుని మూక్స్ విధానంలో కోర్సులందిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియన్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. కేవలం భారత విద్యార్థులు లక్ష్యంగా ఎడెక్స్ సహకారంతో ఎంగేజింగ్ ఇండియా పేరుతో హిందీ లాంగ్వేజ్ కోర్సుకు ఆవిష్కరణ చేసింది.
మరికొన్ని
టఫ్ట్స్ ఓపెన్ కోర్స్‌వేర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విద్యార్థులతోపాటు స్వయంగా నేర్చుకునేవారి కోసం టఫ్ట్స్ యూనివర్సిటీ రూపొందించిన ఉచిత ఆన్లైన్ ప్రాజెక్ట్.. టఫ్ట్స్ ఓపెన్ కోర్స్వే ర్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆన్లైన్ ద్వారా రూపొందించిన ఉచిత విద్యా విధానంలో భాగమే ఈ టఫ్ట్స్ ఓపెన్ కోర్స్‌వేర్.
ప్రవేశం: ఇందులో లభ్యమయ్యే కోర్సులన్నింటినీ ఉచితంగా పొందొచ్చు. ఇందులో వివిధ రకాల సబ్జెక్టులు, వాటి సిలబస్‌లు, ప్రాజెక్టులు, లెర్నింగ్ యూనిట్లు, అనుబంధ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: http://ocw.tufts.edu
ఎంఆర్ యూనివర్సిటీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం
జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన టైలర్ కొవెన్, అలెక్స్ టేబరాక్ అనే ఇద్దరు అర్థశాస్త్ర ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ఆన్లైన్ ఎడ్యుకేషన్ వెబ్సైట్.. ఎంఆర్ యూనివర్సిటీ. మైక్రోఎకనమిక్స్, మాక్రోఎకనమిక్స్తోపాటు ఎవ్రీడే ఎకనమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, డెవలప్మెంట్ ఎకనమిక్స్, గ్రేట్ ఎకనమిస్ట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ మొదలైన కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది. వెబ్సైట్లో మొదట నమోదు చేసుకుని కోర్సులను ఎంచుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా కూడా వీడియోలను చూసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రశ్నలు అడగడానికి, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి నమోదు తప్పనిసరి. వీడియోలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా, స్పీకర్ వాయిస్ ఓవర్ల ద్వారా రూపొందించారు. వీడియోనే కాకుండా ఆడియోను విడిగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
వెబ్సైట్: www.mruniversity.com
ఓపెన్ మిచిగన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్
ప్రపంచవ్యాప్తంగా వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులతోపాటు, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతరులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి ఏర్పాటైన ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్.. ఓపెన్ మిచిగన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. సైన్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, లా, మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, పబ్లిక్ హెల్త్, అర్బన్ ప్లానింగ్, డెంటిస్ట్రీ, సోషల్ వర్క్ వంటివాటిలో కంటెంట్ పొందొచ్చు. ఈ పోర్టల్ పూర్తిగా సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్‌ను మాత్రమే అందిస్తోంది. ఎలాంటి డిగ్రీలను, సర్టిఫికెట్లను అందించదు. మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటైన ఈ వెబ్‌సైట్‌ను అధ్యాపకులు, విద్యార్థులు వారి సొంత పరిశోధనతోపాటు వివిధ అంశాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రవేశం ఇలా: సంబంధిత వెబ్సైట్ హోంపేజీలో ఫైండ్ సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆయా కోర్సుల మెటీరియల్స్, వీడియోలు, సాఫ్ట్వేర్ టూల్స్ మొదలైనవాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: http://open.umich.edu
ఎంఐటీ ఓపెన్ కోర్స్‌వేర్
దాదాపుగా ఎంఐటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను, మెటీరియల్‌ను వెబ్ ఆధారితంగా ఉచితంగా అందిస్తోంది ఎంఐటీ వర్సిటీ. ఈ వెబ్సైట్లో దాదాపు 2000కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీడియో, ఆడియో లెక్చర్స్, లెక్చర్ నోట్స్, అసెస్మెంట్స్, స్టూడెంట్ వర్క్, ఆన్లైన్ పాఠ్యపుస్తకాలు మొదలైనవి ఇందులో లభిస్తాయి.
ప్రవేశం ఇలా: సంబంధిత వెబ్సైట్ హోంపేజీలో కోర్సు సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా విద్యార్థికి కావలసిన కోర్సులను అంశాలవారీగా పొందొచ్చు. ఎంఐటీకి చెందిన క్రాస్ డిసిప్లినరీ కోర్సులు, అనువాద కోర్సులు ఈ విభాగంలో లభిస్తాయి. వెబ్సైట్: http://ocw.mit.edu/index.htm